తలసరి ఆదాయం అభివృద్ధికి గీటురాయా?

తలసరి ఆదాయం అభివృద్ధికి గీటురాయా?

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు మూడోసారి ఎన్నికలు జరుగుతున్న వేళ.. తలసరి ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ సీఎం కేసీఆర్​ పదే పదే చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తలసరి ఆదాయం పెరుగుదలలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇది అభివృద్ధికి గీటురాయిగా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు  చెప్తున్నారు. అయితే, ఒకప్పుడు దేశం లేదా రాష్ట్రం అభివృద్ధిని లెక్కించటానికి జాతీయాదాయాన్ని, తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ,  ప్రపంచీకరణ ధోరణి మొదలైన తరువాత ఆర్థిక అభివృద్ధికి సూచికగా, కొలమానంగా మానవాభివృద్ధి సూచికను (హెచ్​డీఐ )విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

సమ్మిళిత వృద్ధి భావన మొదలైన తరువాత ఆర్థిక అభివృద్ధిని లెక్కించటానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీ) ప్రమాణాలుగా తీసుకుంటున్నారు. కాబట్టి,. రాష్ట్రంలో, దేశంలో సంపద, ఆదాయాలు పెరగటం కంటే మానవాభివృద్ధి జరిగితేనే దాన్ని నిజమైన అభివృద్ధిగా భావించాలి.  ఒక్కశాతం ప్రజల చేతిలో 41శాతం సంపద 2023 ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారంగా దేశంలోని 41శాతం సంపద కేవలం ఒక్క శాతం ప్రజల చేతిలో కేంద్రీకృతమై ఉందని చెబుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రం, దేశం తలసరి ఆదాయాలు పెరిగినంత మాత్రాన అభివృద్ధికి గీటురాయిగా భావించలేం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ఆదాయం 5 లక్షల కోట్ల రూపాయల నుంచి 14 లక్షల కోట్ల రూపాయలకి,  తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి మూడు లక్షల 17వేల రూపాయలకు పెరిగింది నిజమే, కానీ అందుకు మరొక బలమైన అసలు కారణం  కొత్తగా రాష్ట్రం ఏర్పడటమే. 

పెద్ద రాష్ట్రం నుంచి తెలంగాణ చిన్న రాష్ట్రంగా ఏర్పడటంతో తలసరి ఆదాయం పెరగడం  ఒక సహజ పరిణామం.  హైదరాబాద్ ​వంటి మహానగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే తలసరి ఆదాయం పెరగడానికి మూల కారణం. ఆ గణాంకాలే తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా చూపెడుతున్నాయి.  మనం తలసరి ఆదాయాన్నే అభివృద్ధికి ప్రామాణికంగా తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 7 లక్షల 58 వేల రూపాయలుగా ఉంది. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం కేవలం ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని 30 జిల్లాల ఆదాయం హైదరాబాద్,  మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ మూడు జిల్లాల ఆదాయానికి సమానం.

మూడు సంపన్న జిల్లాలు, 30 పేద జిల్లాలు

తెలంగాణ రాష్ట్ర సంపద మొత్తం మూడు జిల్లాలకే పరిమితమైతే దానిని అభివృద్ధి అని పాలకులు చెబుతుంటే నమ్మాలా?  అందుకే తలసరి ఆదాయం అభివృద్ధికి ప్రామాణికం కాదు. తెలంగాణ రాష్ట్రం మానవాభివృద్ధి సూచికలో 13వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజారిపోయింది. 2023 నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారంగా బహుముఖ పేదరికంలో తెలంగాణ రాష్ట్రం 5.88 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. కేరళలో అతి తక్కువగా 0.55 శాతం మాత్రమే పేదరికం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం 4.1శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ తెలియజేస్తోంది. తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మహత్యలలో మూడవ స్థానంలో ఉండగా, 21 పెద్ద రాష్ట్రాలలో తక్కువ అక్షరాస్యత ఉన్న నాలుగవ రాష్ట్రం.  ఐదు శాతం పౌష్టికాహార లోపం, 20.49 శాతం ఇల్లులేని వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.  

ALSO READ : రోల్డ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌తో మస్కా.. అప్పు కోసం నమ్మించి తాకట్టు

నీతి ఆయోగ్ విడుదల చేసిన 2020 సుస్థిరాభివృద్ధి సూచికల్లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంటే తెలంగాణ ర్యాంకు మాత్రం 5వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం 45.8 శాతం ఉంటే సగటున వారి నెలసరి ఆదాయం కేవలం 9,403 రూపాయలు మాత్రమే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ శక్తి వినియోగంలో అగ్రగామిగా ఉంటే సరిపోదు. అభివృద్ధికి నిజమైన ప్రామాణికాలైన విద్య, ఆరోగ్యం, సమానత్వం, జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన లాంటి విషయాలలో కూడా పురోగతి సాధించాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగానే కాదు సంక్షేమ, మానవ అభివృద్ధి రాష్ట్రంగా కూడా వెలుగొందుతుంది.

- డాక్టర్ తిరునాహరి శేషు,ఎకనామిక్స్​ ప్రొఫెసర్,కాకతీయ యూనివర్సిటీ