2026 మార్చిలో రూ.500 నోట్లు బ్యాన్..? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

2026 మార్చిలో రూ.500 నోట్లు బ్యాన్..? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో రూ.500 నోట్లు బ్యాన్‎ కాబోతున్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. 2026 మార్చిలో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‎బీఐ) మార్చి 2026 నాటికి ఏటీఎంల ద్వారా రూ. 500 నోట్లను పంపిణీ చేయడాన్ని ఆపివేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 ఈ క్రమంలో రూ.500 నోట్ల బ్యాన్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది. 2026 మార్చి నాటికి ఆర్‌బీఐ రూ.500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం తోసిపుచ్చింది. రూ.500 నోట్లు రద్దు కాబోతున్నాయంటూ జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని.. అవన్నీ నకిలీ వార్తలని కొట్టిపారేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. 

రూ.500 కరెన్సీ నోటు చట్టబద్ధంగా చెల్లుతుందని, నగదు లావాదేవీల కోసం ప్రజలు దీనిని ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాంటి పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావొద్దని సూచించింది. అధికారిక వర్గాల ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవాలని పేర్కొంది. పీఐబీ క్లారిటీతో రూ.500 నోట్ల రద్దు ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. 

కాగా, రూ.500 నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు వ్యాపించడం ఇదే తొలిసారి కాదు. 2025 జూన్ నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ.. రూ. 500 నోట్ల సరఫరాను నిలిపివేయాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు.