కొన్ని స్టార్టప్‌లు సేకరించిన డేటాను అమ్ముకుంటున్నాయ్‌

కొన్ని స్టార్టప్‌లు సేకరించిన డేటాను అమ్ముకుంటున్నాయ్‌

కంపెనీల్లో చాలా మందికి డేటాను యాక్సెస్‌ చేసుకునే వీలు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఐదేళ్ల క్రితం ఒక్కో కేవైసీ (నో యువర్ కస్టమర్‌‌‌‌) చేసిన ఇంటెర్న్‌‌లకు రూ.200 చొప్పున ఇచ్చేవారిమని ఫిన్‌‌టెక్ కంపెనీ స్లైస్‌‌  సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. డిజిటల్ కేవైసీ విస్తరించడంతో రోజుకి లక్షల కొద్దీ కేవైసీలను  స్టార్టప్‌‌ కంపెనీలు చేస్తున్నాయి. కేవైసీ స్టార్టప్‌‌లు  బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర రంగాల్లోని కంపెనీల తరపున కస్టమర్ల కేవైసీని పూర్తి చేస్తాయి. క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీ ఈక్విఫాక్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఏప్రిల్‌‌, 2021– మార్చి, 2022 మధ్య  ఏకంగా 24 కోట్ల రిటైల్ లోన్లు డిస్‌‌బర్స్ అయ్యాయి. దేశంలో లోన్ అప్రూవల్స్ రేటు తక్కువ కాబట్టి సాధారణంగా డిస్‌‌బర్స్ అయిన లోన్లకు ఐదు రెట్లు ఎక్కువ కేవైసీలు జరుగుతాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 120 కోట్ల కేవైసీలు జరిగాయని అంచనా.

మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రజల పర్సనల్ డేటాను సేకరిస్తున్న స్టార్టప్‌‌లు, ఈ డేటాను సేఫ్‌‌గా ఉంచడానికి సరిపడ చర్యలు తీసుకుంటున్నాయా? కన్జూమర్ల ప్రైవసీకి రక్షణ ఉందా? అంటే..కొన్ని సార్లు కేవైసీ చేసే స్టార్టప్‌‌లు కావాలని చేయకపోయినా పెద్ద మొత్తంలో డేటా లీక్ చేస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌‌లు కావాలనే డేటాను తప్పుగా వాడుతున్నాయి. ఉదాహరణకు ఆధార్‌‌‌‌ యాక్ట్‌‌ను,  డిజిలాకర్ టెర్మ్స్‌‌ను ఉల్లంఘించిందని కర్జా టెక్నాలజీస్‌‌కు ప్రభుత్వ సంస్థ డిజీలాకర్  లెటర్ పంపింది. ఫలితంగా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు  డిజీలాకర్ సర్వీస్‌‌లను వాడుకోకుండా కర్జాను బ్లాక్‌‌లో పెట్టారు. కర్జా వివిధ రకాల కస్టమర్ల కేవైసీ చేస్తుంది.  డిజీలాకర్‌‌‌‌లోని ప్రజల డాక్యుమెంట్లను  రెగ్యులేట్‌‌ కాని సంస్థలు అంటే కేవైసీ స్టార్టప్‌‌లు కూడా యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది.  ఫైనాన్షియల్ సంస్థల తరపున కన్జూమర్ల డాక్యుమెంట్లు కరెక్టాగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని కేవైసీ స్టార్టప్‌‌లు చూస్తాయి. కర్జా టెక్నాలజీస్‌‌కు చెందిన పార్టనర్ ఒకరు ఆధార్ డేటాను డైరెక్ట్‌‌గా తమ ఇంటర్‌‌‌‌ఫేస్‌‌కు పంపుకున్నారని డిజీలాకర్‌‌‌‌ ఆరోపిస్తోంది.