అసెంబ్లీలో చర్చలు కామెడీనా.? మ్యాచ్ ఫిక్సింగా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అసెంబ్లీలో  చర్చలు కామెడీనా.? మ్యాచ్ ఫిక్సింగా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సీఎం, మంత్రులు సుఖంగా ఉంటే చాలా? అని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కింది స్థాయి ఉద్యోగులు చనిపోయినా పర్వాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 10 రోజుల చర్చలు కామెడీనా..? లేదంటే మ్యాచ్ ఫిక్సింగా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కట్టి 50, 60 ఏళ్ళు దాటిపోయిందన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారని చెప్పారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9ఏళ్ళు గడిచినా.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూ.12 వేల కోట్లతో ప్రగతి భవన్ నిర్మించారని, సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించారన్నారు. రాత్రికి రాత్రే పోర్టల్ ఓపెన్ చేసి భూముల పట్టాలు మార్చుకుని అధికారికంగా ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజలకు భూముల కబ్జా విషయం తెలియకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ధరణిలో లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న ఆయన.. వాటినెవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏజెన్సీ ప్రాంత వాసులను కేసీఆర్ ఘోరంగా అవమానించారని, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక్క గుంట పొలం కోసం అదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని అడవిబిడ్డలను జైల్లో పెట్టారని విమర్శించారు.