ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..ఆరో ఇండియన్ బ్యాటర్

ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..ఆరో ఇండియన్ బ్యాటర్

భారత జట్టు  ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.... ద్వైపాక్షిక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీ కొట్టిన  ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన  తొలి వన్డేలో 52 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రెండో వన్డేలో 55 పరుగులు సాధించాడు. చివరి వన్డేలో 77 పరుగులు చేశాడు. దీంత మాజీ క్రికెటర్లు  కృష్ణమాచారి, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్‌ల సరసన నిలిచాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 1982లో  శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత 1985లో శ్రీలంకపైనే  దిలీప్ వెంగ్‌సర్కార్ వరుసగా మూడు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. 1993లో  మహమ్మద్ అజారుద్దీన్ కూడా శ్రీలంకపైనే మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2019లో  మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాపై..2020లో  శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌పై వరుసగా మూడు మ్యాచుల్లో మూడు అర్థసెంచరీలు సాధించారు. 

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ లో  ఇషాన్ కిషన్ వరుసగా మూడు మ్యాచుల్లో మూడు అర్థసెంచరీ బాది.. ఈ ఘనతను అందుకున్నాడు. చివరి వన్డేలో ఇషాన్ కిషన్ 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో  మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి.  సెంచరీ దిశగా సాగిన అతను వేగంగా ఆడే క్రమంలో స్టంపౌటయ్యాడు.