ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర.. పోలీసుల చెరలో ఐసిస్ ఆపరేటివ్

ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర.. పోలీసుల చెరలో ఐసిస్ ఆపరేటివ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసానికి పథకం పన్నిన ఐసిస్‌ ఆపరేటివ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ధులా కువాన్‌లో శుక్రవారం రాత్రి జరిపిన షూటౌట్‌ తర్వాత సదరు వ్యక్తిని అరెస్ట్ చేశామని అధికారులు చెప్పారు. సదరు వ్యక్తి ఉన్న బుద్ధ జయంతి పార్క్‌కు దాదాపు పన్నెండు మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) అధికారులు, బాంబ్ డిటెక్షన్, డిఫ్యూజల్ టీమ్స్‌తో కలసి చేరుకున్నారు. సదరు వ్యక్తిని అబ్దుల్ యూసఫ్‌ ఖాన్‌గా గుర్తించారు. అబ్దుల్ నుంచి ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (ఎల్‌ఈడీ)లను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ–నోయిడాలో అలర్ట్‌ ప్రకటించారు.

‘అబ్దుల్‌ను అరెస్ట్‌ చేశాక అతడు కాల్పులకు దిగాడు. దేశ రాజధానిలో సోలోగా అటాక్‌ చేయడానికి అతడు ప్లాన్ చేశాడు. అతడి దగ్గర నుంచి ఒక పిస్టల్, రెండు ఎల్‌ఈడీలను రికవర్ చేసుకున్నాం’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) ప్రమోద్ కుష్వాలా చెప్పారు. అరెస్టయిన ఐసిస్ ఆపరేటివ్ ఇంట్రాగేషన్‌కు సహకరించడం లేదని, తప్పుడు స్టేట్‌మెంట్స్‌తో అధికారులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నాడని సమాచారం. అతడి కచ్చితమైన అడ్రస్‌ను తాము ఇప్పుడే చెప్పలేమని స్పెషల్ సెల్ అఫీషియల్స్ చెప్పారు. అతడు ఇచ్చిన అడ్రస్‌ను వెరిఫై చేస్తున్నామని ప్రమోద్ పేర్కొన్నారు.