బేయర్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని ఇస్లాంపూర్ గ్రామ రైతులు డిమాండ్

బేయర్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని ఇస్లాంపూర్ గ్రామ రైతులు డిమాండ్

తూప్రాన్ , వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారులో ప్రవహిస్తున్న హల్ది వాగులోని నీటిని అక్రమంగా తోడేస్తున్న బేయర్ కంపెనీ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఇస్లాంపూర్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపూర్ సమీపంలో  ఉన్న కొన్ని వందల ఎకరాల భూమి సాగు హల్ది వాగులోని నీటిపై ఆధారపడి ఉందన్నారు.

కానీ  వాగు సమీపంలో ఉన్న ఓ బేయర్ కంపెనీ నిర్వహకులు వాగులో పెద్ద పెద్ద మోటార్లను పెట్టి అక్రమంగా నీటిని తోడేస్తున్నారని ఆరోపించారు. పంటలు చివరి దశకు రావడంతో తమ పొలాలకు నీళ్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే అధికారులు స్పందించి సదరు కంపెనీపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఈ సమావేశంలో ఇస్లాంపూర్ సురేందర్ రెడ్డి, బిఎన్ తిరుపతిరెడ్డి, బిఎన్ వెంకటరామిరెడ్డి, కుమ్మరి నరసింహులు, గోపిరెడ్డి, కుమ్మరి మహేశ్, రామాయపల్లి చిన్న కృష్ణారెడ్డి, పోలీస్ రాజిరెడ్డి ఉన్నారు.