
- ఫస్ట్ ఫేజ్ ప్లాన్‌పై ఇరు దేశాలు సంతకాలు చేసినట్టు వెల్లడి
- డీల్‌లో భాగంగా 20 మంది ఇజ్రాయెల్ బందీల విడుదల.. బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీల రిలీజ్
జెరూసలెం: రెండేండ్లుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడింది. మొదటి దశ శాంతి ఒప్పందానికి రెండు దేశాలూ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పీస్ డీల్‌పై సంతకాలు కూడా చేశాయని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ‘ట్రూత్ సోషల్’లో పోస్టు పెట్టారు. ‘‘మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేశాయి. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరూ త్వరలోనే విడుదలవుతారు. అలాగే ఇజ్రాయెల్ తన బలగాలను పాలస్తీనా నుంచి వెనక్కి తీసుకుంటుంది.
శాంతి స్థాపన దిశగా ఇదొక కీలక ముందడుగు. ఈ డీల్ కోసం మాతో కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కీయేకు కృతజ్ఞతలు” అని ట్రంప్ పేర్కొన్నారు. పీస్ డీల్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు ఇదొక గొప్ప రోజు అని అభివర్ణించారు. ‘‘బందీలుగా ఉన్న మావాళ్లను విడిపించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన టీమ్ చూపిన డెడికేషన్ కు ధన్యవాదాలు. ఆ దేవుడి దయతో మేం వాళ్లందరినీ తిరిగి ఇంటికి తీసుకురాబోతున్నాం” అని ‘ఎక్స్’లో నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తో పీస్ డీల్‌పై హమాస్ స్పందిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది.
డీల్ లో ఏముంది?
శాంతి ఒప్పందంలో భాగంగా తమ దగ్గర బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ వాసులను హమాస్ విడుదల చేస్తుంది. దీనికి బదులుగా దాదాపు 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తుంది. గాజా సిటీ, ఖాన్ యూనస్, రఫా తదితర నగరాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటుంది. గాజాలో మానవతా సాయం కోసం ఐదు చోట్ల బార్డర్‌ను ఓపెన్ చేస్తుంది. కాగా, శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి పెద్దగా ఇబ్బందుల్లేవని, ఆమోదం లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
స్వాగతించిన ప్రపంచ దేశాలు..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని వివిధ దేశాలు స్వాగతించాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇదొక కీలక ముందడుగు అని పేర్కొన్నాయి.శాంతి ఒప్పందంపై స్పందిస్తూ తుర్కీయే, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, లెబనాన్, ఇటలీ, నెదర్లాండ్స్, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి.
ట్రంప్.. ‘ది పీస్ ప్రెసిడెంట్..’
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు. ఆ అవార్డు తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను ఇప్పటికే ఏడు యుద్ధాలను ఆపానని పదేపదే చెబుతున్నారు. త్వరలో ఎనిమిదో యుద్ధాన్ని (రష్యా, ఉక్రెయిన్ వార్) కూడా ఆపుతానని ప్రకటించారు. ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరగా.. ఆ వెంటనే వైట్‌హౌస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ది పీస్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ఫొటోను షేర్ చేసింది. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనుండగా, వైట్‌హౌస్ ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.