గాజాపై యుద్ధాన్ని ముగించండి.. ఇజ్రాయెల్​కు అమెరికా విజ్ఞప్తి

గాజాపై యుద్ధాన్ని ముగించండి.. ఇజ్రాయెల్​కు అమెరికా విజ్ఞప్తి

తగ్గేదే లేదన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

జెరూసలెం: రెండు నెలలుగా గాజాపై చేస్తున్న దాడిని వీలైనంత త్వరగా ముగించాలని ఇజ్రాయెల్​ను అమెరికా కోరింది. ఇక నుంచి గాజాలోని సామాన్య పౌరుల ప్రాణాలు పోకుండా చూడాలని.. వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ వెళ్లిన సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సులీవాన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్, రక్షణశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. 'నేను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతోనూ మాట్లాడాను. గాజాపై యుద్ధ తీవ్రతను తగ్గించి, హమాస్ టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్​గా  దాడులు చేయాలని కోరాను. పౌరులను కవచాలుగా ఉపయోగించి ఎదురుదాడికి దిగుతున్న హమాస్ టెర్రరిస్టుల వ్యూహాలను తెలివిగా ఎదుర్కోవాల్సిన అవసరముందని సూచించాను. అయితే.. మా విజ్ఞప్తిని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి అమలు చేస్తుందో  నేను చెప్పలేను. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మాత్రం మరింత కాలం కొనసాగుతాయి’ అని సులీవాన్ పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ పై ఆగ్రహాం పెరగడం, దాడిలో సామాన్య  పౌరులే ఎక్కువ మంది చనిపోతుండటంతో అమెరికా  స్వరం మారినట్లు తెలుస్తున్నది.

యుద్ధం ఇంకా కొనసాగిస్తం

హమాస్‌‌పై తమ యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గల్లాంట్ తెలిపారు. హమాస్ టెర్రరిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేసేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు. గాజాలో జరుగుతున్న విధ్వంసంపై పలు దేశాలు ఆగ్రహంగా ఉండటంతో ఇజ్రాయెల్ కు అమెరికా పలు కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో గల్లాంట్ అమెరికాకు రిప్లే ఇచ్చారు. అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు మూడో నెలలోకి ప్రవేశించింది. హమాస్ దాడిలో 1200 మంది మరణించారని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.