బందీల విడుదలకు బ్రేక్​..  గాజాలోకి ట్రక్కులను అనుమతించాలని హమాస్ డిమాండ్​

బందీల విడుదలకు బ్రేక్​..  గాజాలోకి ట్రక్కులను అనుమతించాలని హమాస్ డిమాండ్​

గాజా/జెరూసలెం: ఒప్పందంలో భాగంగా రెండో రోజు కూడా గాజాలో కాల్పుల మోత వినిపించలేదు. అయితే, బందీల విడుదల ప్రక్రియను హమాస్ మిలిటెంట్లు ఆలస్యం చేస్తున్నారు. శనివారం విడుదల చేయాల్సిన 14 మందిని రాత్రి వరకూ వదలలేదు. సహాయక సామగ్రితో రఫా బార్డర్ వద్దే నిలిచి పోయిన ట్రక్కులను  గాజాలోకి అనుమతించాకే రెండో దశ బందీలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

శనివారం విడుదల చేయనున్న బందీల పేర్లతో హమాస్ మిలిటెంట్లు ఓ లిస్టును శుక్రవారం రాత్రే విడుదల చేశారు. ఇజ్రాయెల్ వల్లే బందీల విడుదల నిలిచిందని ఆరోపిస్తున్నారు. ఈజిప్ట్, ఖతర్, అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా హమాస్ 50 మంది బందీలను విడిచిపెట్టాల్సి ఉండగా.. 150 మంది పాలస్తీనియన్  ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేయాల్సి ఉంది. దీనికి అదనంగా హమాస్ రిలీజ్ చేసే ప్రతి పదిమంది బందీలకు ఒకరోజు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.

శుక్రవారం మొదటి రోజు హమాస్ మిలిటెంట్లు 13 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టారు. సెపరేట్ డీల్​లో భాగంగా10 మంది థాయ్​లాండ్ పౌరులు, ఒక ఫిలిప్పీన్స్ జాతీయుడిని కూడా రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది. హమాస్ విడుదలచేసిన ఇజ్రాయెల్ పౌరుల్లో 9 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన ఖైదీల్లో 24 మంది మహిళలు, 15 మంది టీనేజ్ బాయ్స్ ఉన్నారు. ఇంకా 216 మంది బందీలు హమాస్ చెరలో ఉండగా.. ఇజ్రాయెల్​లో 7,200 మంది పాలస్తీనియన్‌‌ ఖైదీలు ఉన్నారు. వీరిలో 2 వేల మందిని యుద్ధం మొదలైన తర్వాతే అరెస్ట్ చేశారు.

రెండో రోజూ గాజా ప్రశాంతం.. 

రెండోరోజు శనివారం కూడా గాజా స్ట్రిప్​లో కాల్పుల మోత ఆగింది. ఫ్యూయెల్ ట్రక్కుల ద్వారా శుక్రవారం 1,29,000 లీటర్ల ఫ్యూయెల్​ను పంపిణీ చేశామని యూఎన్​ వెల్లడించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్​లో శనివారం ప్రజలు క్యాన్​లు, కంటైనర్లు పట్టుకుని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. గాజా సిటీలోని ఓ ఆస్పత్రి నుంచి 40 మంది పేషెంట్లను ఖాన్ యూనిస్ లోని ఆస్పత్రికి తరలించగలిగినట్లు రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది. కాగా, హిందూ మహాసముద్రంలో ఇజ్రాయెల్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్​పై డ్రోన్ అటాక్ జరిగిందని శనివారం అమెరికా వెల్లడించింది.