ఒక్క రోజులోనే 2వ విమానం.. 274మంది ఇండియన్స్ తో నాల్గో ఫ్లైట్

ఒక్క రోజులోనే 2వ విమానం.. 274మంది ఇండియన్స్ తో నాల్గో ఫ్లైట్

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో, భారత ప్రభుత్వం యుద్ధంలో దెబ్బతిన్న ఆ దేశం నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి నాల్గో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. 274 మంది భారతీయులతో కూడిన ఈ ప్రత్యేక విమానం అక్టోబర్ 15న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇది ఒక రోజులో రెండవ విమానం. 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించిన తర్వాత ఇది నాల్గవది. దేశానికి తిరిగి రావాలనుకునే భారతీయ పౌరులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చొరవలో భాగమే ఈ ఆపరేషన్ అజయ్.

అక్టోబరు 7 న గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పట్టణాలపై ఆకస్మిక దాడులను అనుసరించి అక్టోబర్ 12న 'ఆపరేషన్ అజయ్' ప్రారంభమైంది. ఇది యుద్ధంలో దెబ్బతిన్న.. ఆ దేశంలో నివసిస్తున్న సుమారు 18వేల మంది భారతీయులకు ముప్పుగా మారింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "రోజులోని 2వ విమానం టెల్ అవీవ్ నుంచి 274 మంది ప్రయాణికులతో బయలుదేరింది" అని చెబుతూ.. దేశానికి రాబోతున్న వారి ఫొటోలను కూడా షేర్ చేశారు.