ఇజ్రాయెల్, హమాస్ మధ్య..యుద్ధం మళ్లీ షురూ

ఇజ్రాయెల్, హమాస్ మధ్య..యుద్ధం మళ్లీ షురూ
  • గాజాపై రాకెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
  • వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్

గాజా/జెరూసలెం :  ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయంతో ముగిసింది. దీంతో మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. వారం రోజుల పాటు సంధి కొనసాగింది. తమ వద్ద ఉన్న 100 మందికి పైగా బందీలను హమాస్ విడిచిపెట్టింది. జైల్లో ఉన్న 240 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. శుక్రవారం ఉదయం దక్షిణ గాజాలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఫైటర్ జెట్లతో దాడులకు పాల్పడింది. శుక్రవారం ఉదయం 7 గంటలతో కాల్పుల విరమణ ఒప్పదం ముగిసిందని, 7.30 గంటల నుంచి గాజాపై దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్ వివరించింది. హమాస్ రెచ్చగొట్టడంతోనే తాము దాడులకు దిగాల్సి వచ్చిందని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుగా హమాస్ ఉల్లంఘించిందని ఆరోపించింది. గాజా వైపు నుంచి ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు జరిగాయని, అందుకే తాము ప్రతి దాడులు చేసినట్లు వివరించింది. హమాస్ వద్ద ఇంకా 125 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

సంధి కొనసాగింపునకు రిక్వెస్ట్ చేసినా..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులు పొడిగించాల్సిందిగా ఇజ్రాయెల్​ను మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్ట్ కోరినా ఫలితం లేకుండా పోయింది. గాజాపై దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా పౌరుల భద్రత విషయమై ఇజ్రాయెల్ పై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. ఇజ్రాయెల్ ఏం చేసినా.. అంతర్జాతీయ మానవతా చట్టానికి లోబడి చేయాలని అమెరికా సూచించింది. నార్త్ గాజాలో పాలస్తీనియులు ఎదుర్కొన్న కష్టాలు.. సౌత్ గాజాలోని వాళ్లు పడొద్దని తెలిపింది. ఖాన్ యూనిస్ టౌన్​తో పాటు నార్త్​వెస్ట్ గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు హమాస్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇజ్రాయెలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హమాస్ ఆరోపించింది. కాగా, ఇప్పటి దాకా జరిగిన దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు, 14,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.