గాజాలో దాడులు ఆగలె.. మళ్లీ అటాక్​ చేసిన ఇజ్రాయెల్​

గాజాలో దాడులు ఆగలె.. మళ్లీ అటాక్​ చేసిన ఇజ్రాయెల్​
  •     పదుల సంఖ్యలోపాలస్తీనియన్లు మృతి 
  •     పొరపాటున తమ పౌరులు ముగ్గురిని కాల్చిన ఇజ్రాయెల్ ఆర్మీ 

గాజా :  గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు చేసింది. వేలాదిమంది సామాన్యులు మరణిస్తుండడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నా, హమాస్ మిలిటెంట్లను ఏరివేసేదాకా యుద్ధం ఆపబోమని ఇజ్రాయెల్ అంటోంది. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని అమెరికా సూచించిన మరుసటి రోజే గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. శనివారం ఓల్డ్ గాజా, జబాలియా ఏరియాల్లో దాడులు చేసింది. ఓల్డ్ గాజాలో రెండు ఇండ్లపై బాంబులు పడి 14 మంది చనిపోయారని, జబాలియాలోనూ పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా తెలిపింది. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని పేర్కొంది. మరోవైపు గాజా సిటీలోని రెండు స్కూళ్లలో దాక్కున్న మిలిటెంట్లను తమ సైన్యం మట్టుబెట్టిందని ఇజ్రాయెల్ తెలిపింది. 

ఇజ్రాయెల్ పౌరుల నిరసన.. 

ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున హమాస్ మిలిటెంట్ల దగ్గర బందీలుగా ఉన్న తమ పౌరులు ముగ్గురిని కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం గాజా సిటీలో జరిగింది. ఇక్కడి షుజాయిత్ ఏరియాలో ఇజ్రాయెల్ ఆర్మీ, హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ క్రమంలో ముగ్గురు బందీలను మిలిటెంట్లుగా పొరబడిన ఆర్మీ.. వారిని కాల్చి చంపింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెల్ అవీవ్ సిటీలో హైవేపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఇది అంతులేని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.