ఇండియాకు బంపరాఫర్ : లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వనున్న ఇజ్రాయెల్

ఇండియాకు బంపరాఫర్ : లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వనున్న ఇజ్రాయెల్

హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా గత నెలరోజులుగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం కొనసాగిస్తోంది..ఉగ్రవాదులను అంతమొందించే వరకు కాల్పుల విరమణ చేయ బోమని స్పష్టం చేసింది. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై చేసిన  దాడిలో1400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్ సైన్యం గాజా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10 వేల మంది గాజా ప్రజలు చనిపోయారు. నెలరోజులుగా జరుగుతున్న భీకర యుద్దంలో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.  

అక్టోబర్ 7 ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ పక్క గాజాపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు ఇజ్రాయెల్ లో పనిచేస్తున్న పాలస్తీనియన్లపై దృష్టి సారించింది బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం.. అందులో భాగంగా ఇజ్రాయెల్ లో పనిచేస్తున్న పాలస్తీనియన్ కార్మికుల స్థానంలో లక్ష మంది కార్మికులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. 

అక్కడి పత్రికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ లో పనిచేస్తున్న దాదాపు 90 వేల మంది పాలస్తీనియన్ల స్థానంలో ఇండియా నుంచి లక్ష మంది కార్మికులను నియమించుకోవాలని అక్కడి కంపెనీలను అనుమతించాలని ఇజ్రాయెల్ నిర్మాణ రంగం ప్రభుత్వాన్ని కోరింది. 

అక్టోబర్7 హమాస్ ఆకస్మిక దాడులకు ముందు ఇజ్రాయెల్ లో పనిచేసిన పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. కార్మికుల నియామకం విషయంలో భారత్ తో చర్చలు జరుపుతున్నామని.. ఆమోదం కోసం, ఇజ్రాయెల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఇజ్రాయెల్ అసోసియేషన్ తెలిపింది. నిర్మాణ  రంగాన్ని సాధారణ స్థితికి తీసుకు రావడానికి భారత్ నుంచి 50 వేల నుంచి లక్ష మంది కార్మికులను తీసుకుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.