సిరియాలో లైవ్ వదిలేసి పరుగులు పెట్టిన యాంకర్ .. న్యూస్ చానల్ సమీపంలోనే బాంబు దాడి

సిరియాలో లైవ్ వదిలేసి పరుగులు పెట్టిన యాంకర్ .. న్యూస్ చానల్ సమీపంలోనే బాంబు దాడి

డమాస్కస్: ఇజ్రాయెల్– -సిరియా మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. సిరియా రక్షణ శాఖ ప్రధాన కార్యాయలంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రక్షణశాఖ కార్యాలయానికి సమీపంలోనే  ఉన్న న్యూస్ చానల్​లో లైవ్ లో వార్తలు చదువుతుండగానే వెనుక బాంబు దాడి జరగ్గా యాంకర్ మధ్యలోనే కార్యక్రమాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ‘‘డమాస్కస్ కు హెచ్చరికలు చేయడం అయిపోయింది. ఇక దాడులు తప్పవు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. స్వెయిదా ప్రాంతంపై ఇజ్రాయెల్ మిలటరీ భీకర దాడు లు కొనసాగిస్తుందని హెచ్చరించారు.    

ద్రూజ్​లను కాపాడుతామనిఇజ్రాయెల్ ప్రకటన 

దక్షిణ సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య గత ఆదివారం సాయుధ పోరాటం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ద్రూజ్ జాతీయులు పది లక్షల మంది ఉండగా సగం మంది సిరియాలోనే ఉన్నారు. దీంతో ఈ ఘర్షణల్లో ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. సిరియాలోని ద్రూజ్ జాతిని కాపాడతామని ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఇందుకు ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రిగా తాను కట్టుబడి ఉన్నట్టు కాట్జ్ తెలిపారు.