గాజా సెక్యూరిటీ బాధ్యత మాదే!.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

గాజా సెక్యూరిటీ బాధ్యత మాదే!..  ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఖాన్ యూనిస్ (గాజా స్ట్రిప్) : హమాస్ మిలిటెంట్లను సమూలంగా తుడిచిపెట్టేశాక గాజా రక్షణ బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ యుద్ధంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడం, గాజాపై పట్టు సాధించడం కోసమే ఆయన దాడులు కొనసాగిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆరోపణలకు కౌంటర్ గా నెతన్యాహు తాజా ప్రకటన చేశారు. ఈమేరకు ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వల్ప విరామం...

హమాస్ చెరలోఉన్న బందీలను విడుదల చేసేంత వరకూ దాడులు ఆపేది లేదని మొండిపట్టు పట్టిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా మెత్తబడ్డారు. కాల్పుల విరమణ కుదరదంటూనే దాడులకు స్వల్ప విరామాలు ప్రకటించేందుకు సిద్ధమని తెలిపారు. మానవతా సాయం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నార్త్  గాజాలోని సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని కాల్పులకు స్వల్ప విరామం ఇవ్వనున్నట్లు నెతన్యాహు తెలిపారు. అయితే, ఓవైపు అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి, మరోవైపు గాజాలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడంతో అంతర్జాతీయంగా దేశానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలబడిన అమెరికా.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గింది. యుద్ధానికి విరామం ఇవ్వాలంటూ ఇటీవల అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్ ఇజ్రాయెల్​కు సూచించారు.