మిలిటెంట్ల వేటకు టన్నెల్స్​లోకి నీళ్లు

మిలిటెంట్ల వేటకు టన్నెల్స్​లోకి నీళ్లు

గాజా/జెరూసలెం:  గాజా స్ట్రిప్​లోని పట్టణాల్లో భూగర్భంలో హమాస్ మిలిటెంట్లు దాక్కున్న టన్నెల్స్ ను నీటితో నింపి.. మిలిటెంట్ల వేటను కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు సోమవారం వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. అల్ షతీ రెఫ్యూజీ క్యాంపు వద్ద టన్నెల్స్ కు సమీపంలో ఐదు భారీ పంపులను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది. ఈ పంపులతో గంటకు వేలాది క్యూబిక్ లీటర్ల నీటిని టన్నెల్స్​లోకి పంపించవచ్చని పేర్కొంది. 

సొరంగాలన్నీ నీటితో నిండిపోతే మిలిటెంట్లకు వేరే దారి లేక బయటకు రాక తప్పని పరిస్థితి ఉంటుందని పేర్కొంది. అయితే, బందీలను సొరంగాల్లోనే దాచామని హమాస్ చెప్తున్నందున.. బందీలందరినీ విడుదల చేయించుకున్నాకే ఇజ్రాయెల్ బలగాలు టన్నెల్స్​ను నీటితో నింపుతాయా? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదని తెలిపింది. దద్దరిల్లిన దక్షిణ గాజా  
గాజా స్ట్రిప్​లో హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులను తీవ్రం చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి ఖాన్ యూనిస్ టౌన్ శివార్లలో భీకరమైన బాంబుదాడులను కొనసాగించాయి. మంగళవారం తెల్లవారుజాము దాకా కొనసాగిన ఈ దాడులతో పదులకొద్దీ చనిపోయారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్ సైరన్ మోతలతో ఖాన్ యూనిస్ పట్టణం మారుమోగింది. ఇజ్రాయెల్  ఒకవైపు ఏరియల్ స్ట్రైక్స్ చేస్తూనే.. మరోవైపు భూతల దాడులకు పాల్పడుతోంది. పౌరులు చనిపోకుండా చూడాలన్న అమెరికా సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని.. వీలైనంత వరకూ కచ్చితమైన దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. కాగా, యుద్ధంలో ఇప్పటివరకూ 15,890 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, వీరిలో 70% మంది మహిళలు, పిల్లలేనని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. సుమారు 42 వేల మంది గాయపడ్డారని పేర్కొంది.