ఖతార్కు సారీ చెప్పిన నెతన్యాహు

ఖతార్కు సారీ చెప్పిన నెతన్యాహు
  • ట్రంప్​తో భేటీ తర్వాత వైట్​హౌస్​ నుంచే ఫోన్​
  • దోహాపై దాడి ఘటనకు విచారం
  • ట్రంప్​ ఒత్తిడి మేరకే ఫోన్​ కాల్!

వాషింగ్టన్​ డీసీ: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానికి సారీ చెప్పారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ పై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు సోమవారం ఉదయం ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. హమాస్ తో యుద్ధం, గాజాపై దాడులు, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. 

అయితే, ట్రంప్, నెతన్యాహు చర్చించిన విషయాలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడించలేదు. ఈ మీటింగ్ లోనే ట్రంప్ సూచనల మేరకు నెతన్యాహు ఖతార్ ప్రధానికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఇటీవల తమ వైమానిక దళం దోహాపై జరిపిన స్ట్రైక్ పట్ల నెతన్యాహు విచారం వ్యక్తం చేశారని, ఇదే విషయంపై షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానిని క్షమాపణ కోరారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని నెతన్యాహు చెప్పారని తెలిపాయి. 

ఈ నెల 9న ఇజ్రాయెల్ సైన్యం దోహాపై వైమానికి దాడి చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజా భేటీలో నెతన్యాహుపై ఒత్తిడి తీసుకొచ్చి ఖతార్ కు సారీ చెప్పించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.