‘ఎల్వీఎం3-ఎం3’ ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

‘ఎల్వీఎం3-ఎం3’ ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

బెంగళూరు: ఇటీవలే బ్రిటన్​కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ తరఫున 36 శాటిలైట్లను దిగువ భూకక్ష్యకు చేర్చిన ఇస్రో.. మరో 36 వన్ వెబ్ ఉపగ్రహాలను నింగికి పంపనుంది. ఇందుకోసం వచ్చే జనవరిలో లేదా ఫిబ్రవరిలో ‘ఎల్వీఎం3-ఎం3’ రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్​లో క్రయోజెనిక్ స్టేజీలో వినియోగించే అత్యంత బరువైన సీఈ–20 ఇంజన్​కు శుక్రవారం ఫ్లైట్ యాక్సెప్టెన్స్ టెస్టును విజయవంతంగా నిర్వహించినట్లు శనివారం ఇస్రో వెల్లడించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఉన్న హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ఇంజన్ ను 25 సెకన్ల పాటు టెస్ట్ చేసినట్లు తెలిపింది. 

ఈ ఇంజన్ ఆశించిన మేరకు సత్తా చాటినట్లు పేర్కొంది. కాగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశవ్యాప్తంగా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు వన్ వెబ్, భారతి గ్లోబల్ కంపెనీలు కలిసి వన్ వెబ్ ప్రాజెక్టును చేపట్టాయి. మొత్తం 72 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్​లోకి పంపేందుకు ఇస్రో​తో కాంట్రాక్ట్  కుదుర్చుకున్నాయి. ఈ నెల 23న 36 శాటిలైట్లను నింగికి పంపిన ఇస్రో.. వచ్చే ప్రయోగంలో మిగతా ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది.