ఓటమి నుంచే పాఠం నేర్చుకోవాలి : సోమనాథ్​

ఓటమి నుంచే పాఠం నేర్చుకోవాలి : సోమనాథ్​
  • గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన వర్సిటీ

జేఎన్​టీయూ(హైదరాబాద్), వెలుగు :  తాను జీవితంలో ఎన్నో పరాజయాలు చూశానని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఇస్రో చైర్మన్ సోమనాథ్​ అన్నారు. ప్రారంభంలో రాకెట్​ రూపకల్పనలోనూ చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వాటన్నింటినీ అధిగమించి మూడు సక్సెస్​ఫుల్​ ప్రాజెక్టులు చేశామని చెప్పారు. శుక్రవారం జేఎన్​టీయూహెచ్ 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

కార్యక్రమంలో సోమనాథ్​కు జేఎన్​టీయూహెచ్​ ​వీసీ ప్రొఫెసర్​కట్టా నర్సింహారెడ్డి  గౌరవ డాక్టరేట్​ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్​ మాట్లాడుతూ.. గోల్డ్​మెడల్స్, పీహెచ్​డీ, డిగ్రీ పట్టాలు తీసుకునే ఈ రోజు ప్రతి స్టూడెంట్​కు మరుపురానిదన్నారు. ప్రతి స్టూడెంట్​ఈ స్థానంలో ఉండడం వెనుక వారి పేరెంట్స్​, టీచర్స్​ కృషి ఉంటుందన్నారు. దేశంలో నిపుణులైన ఇంజినీర్లను తయారు చేయడంలో ప్రొఫెసర్ల కృషి ఉందన్నారు. 

టెక్నాలజీలో ఈ దేశాన్ని ముందు వరుసలో నిలుపుతున్న సంస్థల్లో ఇస్రో కూడా ఒకటన్నారు. తక్కువ ఖర్చుతో మంచి ప్రాజెక్టులు చేసేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని చెప్పారు. చంద్రయాన్ –3 విజయం దేశం గర్వించేలా చేసిందన్నారు. స్పేస్​ రంగంలో మరిన్ని  స్టార్టప్​లు, ఇండస్ట్రీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనివర్సిటీలో టాపర్స్​గా నిలిచిన 54 మందికి గోల్డ్​ మెడల్స్ అందజేశారు. 

142 మందికి పీహెచ్​డీ పట్టాలు ఇచ్చారు. ఈ కాన్వొకేషన్​కు హాజరుకాలేకపోయిన గవర్నర్, వర్సిటీ చాన్స్​లర్​ తమిళిసై స్టూడెంట్స్​కు సందేశాన్ని పంపారు. విద్యార్థులు దేశం గర్వించేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎన్​టీయూహెచ్​ రిజిస్ట్రార్​ మజూర్​ హుస్సేన్, రెక్టార్​ గోవర్ధన్​, ప్రొఫెసర్లు,  స్టూడెంట్స్, వారి పేరెంట్స్  పాల్గొన్నారు.