35 కోట్లకే రాకెట్!

35 కోట్లకే రాకెట్!

    నాలుగు నెలల్లోనే తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో ఇప్పటికే ప్రపంచంలోనే బెస్ట్ స్పేస్ ఏజెన్సీగా సత్తా చాటింది. అయితే వందల కోట్ల రూపాయలకు బదులుగా జస్ట్ రూ. 30 నుంచి 35 కోట్ల ఖర్చుతోనే చిన్న రాకెట్లను తయారు చేయడంపై ఇస్రో ఇప్పుడు ఫోకస్ పెట్టింది. 500 కేజీలలోపు మినీ, మైక్రో, మీడియం శాటిలైట్లను పంపేందుకు ఈ రాకెట్లను ఉపయోగించనున్నారు. మరో నాలుగు నెలల్లోనే ఈ సిరీస్​లో తొలి ప్రయోగం చేపట్టేందుకు కూడా ఇస్రో సిద్ధమవుతోంది. ఈ రాకెట్లు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఇస్రోకు మరింత అడ్వాంటేజ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తిరువనంతపురంలో శుక్రవారం ‘ఎడ్జ్ 2020, ద స్పేస్ కాన్ క్లేవ్’లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ టి.వి. హరిదాస్ మాట్లాడుతూ.. ఈ రాకెట్లను ఇస్రో మూడు వారాల్లోనే తయారు చేయగలదని వెల్లడించారు. రాకెట్ల తయారీ కోసం ఇస్రో సుమారుగా రూ. 11 వేల కోట్లను ఖర్చు చేయనుందని, ఇందులో రూ. 6 వేల కోట్లను పీఎస్ఎల్వీ రాకెట్లు, మిగతాది జీఎస్ఎల్వీ రాకెట్ల తయారీకి వాడనున్నట్లు తెలిపారు.