గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ హోల్డ్.. సాంకేతిక లోపంతో నిలిచిన ప్రయోగం

 గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ హోల్డ్..  సాంకేతిక లోపంతో నిలిచిన ప్రయోగం

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్ష చివరి నిమిషంలో ఆగింది. టీవీ-డీ1 ప్రయోగంలో సాంకేతిక లోపం కారణంగా ఈ వాహననౌక పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) హోల్డ్‌ చేసింది. ప్రయోగ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామన్నారు.  రాకెట్ ఇంజిన్‌లో ఇగ్నిష‌న్ లోపం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఇంజిన్ మండ‌క‌పోవ‌డం వ‌ల్ల అనుకున్న స‌మ‌యానికి గ‌గ‌న్‌యాన్ మాడ్యూల్ ప‌రీక్షను వాయిదా వేశారు. అన్ని సరిచూసుకొని మరోసారి పరీక్ష చేపడతామన్నారు. శనివారం (అక్టోబర్ 21న) ఉదయం 8.00 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఇందుకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ హోల్డ్ లో పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. చివరి నిమిషంలో హోల్డ్ లో పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. 

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు గగన్‌యాన్‌ ప్రాజెక్టు చేపట్టారు. కీలక ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం (అక్టోబర్ 21న) ఉదయం 8 గంటలకు ప్లాన్ చేసింది. అయితే.. అరగంట ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆ తర్వాత ప్రకటించారు. ఇప్పుడు దాన్ని కూడా నిలిపివేశారు. ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) అనే పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను విశ్లేషించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. 

గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో టార్గెట్. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. ముందుగా టీవీ-డీ1 పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.