
ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి
ఇక గగన్‌యాన్‌కు రెడీ అవుతున్నం
చిన్న రాకెట్లు పంపే రాకెట్ చేస్తున్నం
చంద్రయాన్ 2 ఆర్బిటర్ బాగా పని చేస్తోందని, ప్రయోగాలు మొదలుపెట్టిందని ఇస్రో చైర్మన్ కె.శివన్ చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌తో కనెక్షన్ ఎందుకు తెగిపోయింది? ఏం తప్పు జరిగిందో తెలుసుకోవడానికి జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తోందని తెలిపారు. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి శివన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టంతా గగన్‌యాన్‌పైనే ఉందని ఆయన చెప్పారు. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ను రూపొందించే పనిలో ఉన్నామని, ఇండియన్ రాకెట్‌తో ఆస్ట్రొనాట్లను అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్టు చేస్తున్నామని వివరించారు.
చంద్రుడి త్రీడీ మ్యాపింగ్
చంద్రయాన్ 2 ఆర్బిటర్‌లోని 8 పరికరాలు (పేలోడ్లు) అద్భుతంగా పనిచేస్తున్నాయని తన వెబ్‌సైట్‌లో ఇస్రో పేర్కొంది. పేలోడ్ల ద్వారా చంద్రుడి ఉపరితలానికి సంబంధించి వివరాలు తెలుసుకోనున్నామని, ఉపరితలాన్ని త్రీడీ మ్యాపింగ్ చేయనున్నామని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం, సిలికాన్, టైటానియం, సోడియం వంటి మూలకాలున్నాయో లేదో కనుగొంటామంది. చంద్రుని ధ్రువాలపై మంచు ఎక్కడెక్కడ ఉందో కూడా తెలుసుకుంటామని చెప్పింది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను 6 నెలల లైఫ్ టైంతో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇలాగే చంద్రయాన్ 2 ఆర్బిటర్ జీవితకాలన్ని పెంచనున్నారు. ఒక ఏడాది కోసం తయారు చేసిన ఆర్బిటర్‌ను ఏడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
మళ్లీ 14 రోజుల తర్వాత
ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగుతున్న టైంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో కనెక్షన్ తెగిపోయింది. కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, నాసా ప్రయత్నించినా కుదరలేదు. 14 రోజులు పని చేసేలా రెడీ చేసిన ల్యాండర్ జీవితకాలం ఈ నెల 21తో పూర్తయింది. ఆదివారం నుంచి అక్కడ రాత్రి మొదలవుతుంది. 14 రోజులు ఉంటుంది. చంద్రుడిపై పగలు 130 డిగ్రీలు, రాత్రి దాదాపు మైనస్ 200 డిగ్రీలకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంతటి చలిని తట్టుకునేలా ల్యాండర్, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఏదేమైనా 14 రోజుల తర్వాత పగలు స్టార్టయ్యాక ల్యాండర్ కోసం ఆర్బిటర్ మళ్లీ వెతకనుంది.
ఇస్రోకు లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్: నాసా సైంటిస్టు
చంద్రయాన్ 2 ఇస్రోకు ఓ మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అని, తప్పుల నుంచి సైంటిస్టులు చాలా నేర్చుకుంటారని నాసాలో స్పేస్‌క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజినీర్ అన్నే డెవెరెయాక్స్ అన్నారు. చంద్రుని గురించి చాలా వరకు సమాచారం తెలుసుకుందని చెప్పారు. ‘ఇండియన్ సైంటిస్టులు బాగా పని చేశారు. చాలా సమాచారం సేకరించారు. ఆర్బిటర్ సక్సెస్ అయింది’ అన్నారు. విక్రమ్ ల్యాండర్ ఎందుకు ఫెయిలైందని అడగ్గా.. అది ఇస్రో సైంటిస్టులే తెలుసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.