
రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్.. మూడోసారీ విజయవంతంగా ల్యాండయింది. 4 కి.మీ.ల దూరం, 4.5 కి.మీ.ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేయగా రన్ వేను వెతుక్కుంటూ, దారి సరి చేసుకుంటూ వచ్చి నిర్ధారించిన ప్లేస్‌లో దిగింది.
న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారీ పుష్పక్విజయవంతంగా ల్యాండయింది. ఆదివారం ఉదయం కర్నాటకలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏఎన్‌టీ) లో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ ఫుల్‌గా పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించేందుకు దేశీయంగా తయారు చేసిన రీయూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) పేరే పుష్పక్.. దీనిపై ఇప్పటికే రెండుమార్లు ల్యాండింగ్ టెస్టులు విజయవంతంగా పూర్తిచేశామని, చివరి టెస్టులోనూ పుష్పక్ పాస్ అయిందన్నారు. తర్వాతి స్టేజ్‌లో పుష్పక్‌తో ఆర్బిటల్ టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
ఆదివారం పరీక్షలో భాగంగా పుష్పక్‌ను చినూక్ హెలీకాఫ్టర్ ద్వారా ఏఎన్టీకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేసినట్లు సోమ్ నాథ్ తెలిపారు. దిగాల్సిన ప్రదేశంలో రన్ వేను వెతుక్కుంటూ, దారి సరి చేసుకుంటూ పుష్పక్ నేల వైపు దూసుకొచ్చిందని వివరించారు. ల్యాండింగ్ సమయంలో పుష్పక్ వేగం గంటకు 320 కిలోమీటర్లుగా నమోదైందన్నారు. అయితే, పారాచూట్ బ్రేకింగ్ వ్యవస్థ సాయంతో పుష్పక్ రన్ వే పై ఆగిందని పేర్కొన్నారు. తాజా పరీక్షతో ప్రతికూల వాతావరణంలోనూ సేఫ్ గా దిగే సామర్థ్యం తనకుందని పుష్పక్ ఈ పరీక్షలో నిరూపించుకుందని వివరించారు.