శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఇస్రో

శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఇస్రో

న్యూఢిల్లీ: బ్రిటన్ కంపెనీ వన్ వెబ్ కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇస్రో ఈ నెల 26న ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 36 శాటిలైట్లను రాకెట్ లో అమర్చే ప్రక్రియ పూర్తయిందని గురువారం వన్ వెబ్ కంపెనీ వెల్లడించింది. వన్ వెబ్ కంపెనీతోపాటు సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతి ఎంటర్ ప్రైజెస్ కలిసి ‘వన్ వెబ్, లియో (లో ఎర్త్ ఆర్బిట్)’ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీని స్థాపించాయి. 

లో ఎర్త్ ఆర్బిట్ లోకి మొత్తం 618 శాటిలైట్లను పంపి.. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోయిన ఏడాది అక్టోబర్ 23న కూడా ఇస్రోకు చెందిన ఎల్వీఎం –3 (లాంచ్ వెహికల్ మార్క్–3) రాకెట్ ద్వారా 36 శాటిలైట్లను నింగికి చేర్చారు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మేరకు ఇప్పుడు మరో 36 శాటిలైట్లను పంపనున్నారు. అమెరికన్ కంపెనీ స్పేస్ ఎక్స్, ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ తోనూ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటివరకు 17 విడతల్లో 582 శాటిలైట్లను నింగికి పంపారు. ఇస్రో చేపట్టబోయే ప్రయోగంతో అంతరిక్షంలో వన్ వెబ్ శాటిలైట్ల సంఖ్య 618కు చేరుతుంది. దీంతో వన్ వెబ్ ఆధ్వర్యంలో జనరేషన్ 1 లియో కాన్ స్టెల్లేషన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.