తప్పుడు కక్ష్యలోకి రెండు ఉప గ్రహాలు

తప్పుడు కక్ష్యలోకి రెండు ఉప గ్రహాలు

ఇండియన్​ స్పేస్​ రిసెర్చ్​ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలి స్మాల్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) మిషన్ విఫలమైంది. శ్రీహరికోటలోని స్పేస్​ పోర్ట్​ నుంచి ఇవాళ ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ప్రయోగించిన ‘ఎస్ఎస్ఎల్వీ - డీ1’ రాకెట్ దారి తప్పింది. దీంతో అది తీసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు.. తప్పుడు కక్ష్యలోకి ప్రవేశించాయి. 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ఈ ఉపగ్రహాలను రాకెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా అలా జరగలేదు. సాంకేతిక లోపం వల్ల 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి రెండు ఉపగ్రహాలను వదిలింది. వాటి నుంచి ఇస్రో కంట్రోల్‌ సెంటర్‌కు సిగ్నల్‌ అందడం లేదు. తప్పుడు కక్ష్యలోకి చేరిన రెండు ఉపగ్రహాలు వినియోగ యోగ్యం కావని ఇస్రో ప్రకటించింది. సెన్సర్ వ్యవస్థ విఫలం కావడం వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేసింది. రాకెట్ నింగికి ఎగిసే మూడు దశలూ విజయవంతం అయినప్పటికీ.. నాలుగోదైన టర్మినల్ దశలోకి చేరే సమయంలో తలెత్తిన సమాచారపరమైన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తుందని వెల్లడించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ‘ఎస్ఎస్ఎల్వీ - డీ2’ మిషన్ ను చేపడతామని తెలిపింది. 

పీఎస్ఎల్వీ.. ఎస్ఎస్ఎల్వీ

 స్మాల్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) పొడవు 34 మీటర్లు. సాధారణంగా ఇంతకుముందు వరకు ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) కంటే ఎస్ఎస్ఎల్వీ పొడవు 10 మీటర్లు తక్కువ. ఇంత తక్కువ సైజు ఉండటం వల్లే దీనికి స్మాల్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్ అని పేరు పెట్టారు. ‘ఈ మిషన్ ఎంతో క్లిష్టమైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక అంశాలు కొన్నిగంటల్లో తెలుస్తాయి’ అని ఇస్రో మాజీ చీఫ్, డాక్టర్ మాధవన్ నాయర్ చెప్పారు. 

ఆజాదీశాట్..

‘ఎస్ఎస్ఎల్వీ డీ1’ రాకెట్ తో నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాల్లో..  ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్)- 02, 750 మంది భారత గ్రామీణ విద్యార్థినులు తయారుచేసిన ‘ఆజాదీ శాట్’ ఉన్నాయి. తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థినులు కూడా ఈ ఉపగ్రహం తయారీలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలకు గుర్తుగా ‘ఆజాదీ శాట్’ను తయారు చేశారు. కేవలం 8 కిలోల బరువున్న ఆజాదీశాట్ జీవితకాలం ఆరు నెలలు. ఇక ఈఓఎస్2 శాటిలైట్ బరువు 140 కిలోలు. ఇది భూమిపై మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీ అందించడంలో ఉపయోగపడుతుంది. భూమిని నిశితంగా పరిశీలించేలా రూపొందించారు.