ప్రత్యర్థులను ఎదుర్కొలేకనే ఐటీ దాడులు: వైఎస్ షర్మిల

ప్రత్యర్థులను  ఎదుర్కొలేకనే ఐటీ దాడులు: వైఎస్  షర్మిల

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కోలేకనే అధికారాన్ని వాడుకుని ఐటీదాడులకు పాల్పడుతున్నాని వైఎస్ షర్మిల విమర్శించారు. గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు ప్రధాని మోదీ సహాయం చేస్తున్నారని బుధవారం ట్విట్టర్ లో వైఎస్. షర్మిల పోస్ట్ పెట్టారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలన్న సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు.

గల్లీలో కుస్తీ పడుతూ, ఢిల్లీలో తెరచాటు రాజకీయాలు నడిపే వారికీ ఈ ఎన్నికలే గుణ పాఠం అవుతాయని తేల్చి చెప్పారు. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులను ఇబ్బందుల పాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ ఎస్ లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాళేశ్వరం, లిక్కర్ స్కాంల పై ఎలాంటి చర్యలు లేవని, బీఆర్ ఎస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరుగవని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముందని ప్రశ్నించారు. మరి కొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని షర్మిల జోస్యం చెప్పారు.