మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు

మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండో రోజూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మంత్రి ఇంటి దగ్గరకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సెంట్రల్ ఫోర్సెస్ భద్రత మధ్య అధికారులు తనిఖీలు కొనసాగించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్, ఫార్మసీ కాలేజీల్లోనూ సోదాలు చేశారు. యూనివర్సిటీ, ఆస్పత్రి ఇతర వ్యాపార సంస్థల లావాదేవీలపైనా ఆరా తీశారు.

కార్యకర్తలకు అభివాదం

సోదాలు కొనసాగుతున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి.. అనుచరులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పారు. తమ బ్యాంకు అకౌంట్లు, లావాదేవీలు అన్ని సక్రమంగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని, అందరూ తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరారు.  

కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం

తనిఖీల్లో భాగంగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి అధికారులు ఒక కారులో బ్రీఫ్ కేసును తీసుకెళ్లడం మీడియా ప్రతినిధులకు కనిపించింది. అందులో పలు కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో దాడుల తర్వాత సీల్ చేసిన సూట్ కేసులను కార్లలో తరలించారు. మల్లారెడ్డి ఇంట్లో కాలేజీల ఫీజులు, లావాదేవీలకు సంబంధించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు.. మంత్రి మల్లారెడ్డి బంధువు సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు మొత్తం దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. 

బ్యాంకు లాకర్లలో ఏం దొరికాయి..? 

మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో లభించిన సమాచారం ఆధారంగా బాలానగర్ లోని క్రాంతి బ్యాంక్ లో రెండో రోజు తనిఖీలు చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురును బాలానగర్ లోని క్రాంతి బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆ బ్యాంకులోని లాకర్లను ఐటీ శాఖ అధికారులు ఆమెతో ఓపెన్ చేయించారని సమాచారం. ఈ లాకర్ లోనే మరో 8 బ్యాంకులకు చెందిన ఆర్థిక లావాదేవీల వివరాలు, 12 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర

రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాము దొంగ దందాలు చేయడం లేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు తన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తన కొడుకును వేధించడంతోనే ఆస్పత్రి పాలయ్యాడని ఆరోపించారు. సోదాల పేరుతో దౌర్జన్యం చేయడం సరికాదని మల్లారెడ్డి వాపోయారు. అంతకుముందు హాస్పిటల్లో ఉన్న తమ కుమారుడు మహేందర్ రెడ్డిని పరామర్శించారు. టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు మహేందర్ రెడ్డిని పరామర్శించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. 

మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

మరోవైపు..ఐటీ దాడులను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల నిరసనలు తెలియజేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆందోళనలు చేపట్టారు.

ఐటీశాఖ అధికారులపై మంత్రి సీరియస్ 

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో  రెండోరోజు ఐటీ దాడులు కొనసాగాయి. మల్లారెడ్డి కాలేజీలు, ఇతర లావాదేవీలకు సంబంధించి 10 కోట్ల నగదు తో పాటు... కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి బ్యాంకులో మరో 8 బ్యాంకుల్లో లాకర్ల వివరాలు గుర్తించారు అధికారులు. దాడులపై సీరియస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఐటీ అధికారులు దొంగలు... తరిమి కొట్టాలని కామెంట్ చేశారు. 

చెస్ట్ నొప్పితో ఆస్పత్రికి మల్లారెడ్డి పెద్ద కుమారుడు 

ఉదయం చెస్ట్ పెయిన్ వచ్చిందంటూ మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో చేరారు. కుమారుడిని చూసేందుకు సూరారంలోని హాస్పిటల్ వెళ్లే సమయంలో ఐటీ అధికారులపై మల్లారెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ అధికారులు దొంగలు, వాళ్లను తరిమికొట్టాలన్నారు. మల్లారెడ్డితోపాటు టీఆర్ఎస్ నేతలు, పలువురు ఎమ్మెల్సీలు హాస్పిటల్ కు వెళ్లారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి..తన బంధువు ప్రవీణ్ రెడ్డిని తీసుకుని మరోసారి హాస్పిటల్ కు వెళ్లారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. హాస్పిటల్ కు తీసుకువెళ్లినప్పుడు ప్రవీణ్ రెడ్డి చేతికి కట్టు ఉంది. వైద్య పరీక్షల తర్వాత సాయంత్రం డిశ్చార్జ్ చేసి ప్రవీణ్ రెడ్డిని పంపించారు. సోదాల సందర్భంగా తన కుమారుడు మహేందర్ రెడ్డిపై దాడి జరిగిందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కానీ, మహేందర్ రెడ్డికి గతంలోనే ఛాతీ నొప్పి ఉందని మల్లారెడ్డి చిన్నకోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. 

పెద్ద ఎత్తున నోట్ల కట్టలు స్వాధీనం

ఇప్పటికే రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. వాటికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సర్క్యులేట్ అయ్యాయి. కానీ, ఇప్పటివరకు ఎంత డబ్బు స్వాధీనం చేసుకున్నారన్న విషయంపై ఐటీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాదాపు 10 కోట్లకు పైగానే నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.