కేసీఆర్ ప్రకటించి 4 నెలలు దాటినా గిరిజనబంధుపై నోక్లారిటీ

కేసీఆర్ ప్రకటించి 4 నెలలు దాటినా గిరిజనబంధుపై నోక్లారిటీ
  • పోడు భూములకు పట్టాలిస్తేనే అర్హుల గుర్తింపు
  • ఈ బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తేనే స్కీమ్ ముందుకు

హైదరాబాద్, వెలుగు:దళితులకు ద‌‌‌‌ళిత బంధు మాదిరిగానే గిరిజనుల కోసం త్వరలో గిరిజ‌‌‌‌న బంధు అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి నాలుగు నెలలు దాటింది. ఇంకా ఆ స్కీమ్ పట్టాలెక్కలేదు, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంలోనూ క్లారిటీ లేదు. నిరుడు సెప్టెంబర్ 17న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల‌‌‌‌ ఆత్మీయ స‌‌‌‌భలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లతోపాటు గిరిజన బంధు స్కీమ్ ను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గిరిజన బంధు స్కీమ్ ను మునుగోడు నియోజకవర్గ తండాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ నేతలు ప్రస్తావించారు. దీంతో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధులాగే.. మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన బంధు స్కీమ్ ను ప్రకటించారనే విమర్శలు వినిపించాయి. ఎన్నికల కోడ్ ముగిసి రెండున్నర  నెలలు దాటినా ఇప్పటికీ స్కీం అతీగతీ లేదు. వచ్చే నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తేనే స్కీమ్ అమలుకు 
చాన్స్ ఉంది.

భూమి లేని కుటుంబాలు 3 లక్షలు..

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 36,02,288 మంది (9.91 శాతం) గిరిజనులు ఉండగా, 9 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం 2021 నవంబర్‌‌‌‌ లో పోడు రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించగా.. 13.18 లక్షల ఎకరాలపై హక్కుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హత కల్గిన దరఖాస్తుల సంఖ్య 3.5 లక్షలుగా గుర్తించారు. ఇప్పటికే పట్టా భూములు కలిగి రైతు బంధు పొందుతున్న గిరిజన రైతులు 8.24 లక్షల మంది ఉన్నట్లు సర్కార్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. పట్టాదారు పాస్ బుక్స్ కలిగిన రైతులు, పాతవి, కొత్తగా జారీ చేయబోయే పోడు హక్కు పత్రాలు కలిగిన పోడు రైతుల సంఖ్య కలిపితే మొత్తం గిరిజన రైతుల సంఖ్య 15 లక్షలకు మించే అవకాశం లేదు. కుటుంబాలవారీగా చూస్తే సుమారు 6 లక్షల గిరిజన కుటుంబాలు భూములు కలిగి ఉన్నాయని అంచనా. ఈ కుటుంబాలు పోనూ మరో 3 లక్షల కుటుంబాలకు గిరిజన బంధును వర్తింపజేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే  గిరిజనుల స్కీమ్ లు, సబ్సిడీలు బంద్

రాష్ట్రంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో లాగే గిరిజన కార్పొరేషన్ లోనూ సబ్సిడీ లోన్లు బంద్ అయ్యాయి. గిరిజన యువత కోసం తీసుకొచ్చిన డ్రైవర్ ఎంపవర్​మెంట్ స్కీంను ప్రభుత్వం మూడేండ్లుగా అమలు చేయడం లేదు. ఈ స్కీంకు నిధులు ఇవ్వడం లేదు. ఈ స్కీం కోసం సుమారు లక్ష మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎనిమిదేండ్లలో 34,873 మందికి మాత్రమే ఈ స్కీం అందింది. మరోవైపు ఎకానమిక్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్)ను కూడా అమలు చేయడం లేదు. ఈ ఎనిమిదేండ్లలో 1,120 మందికి మాత్రమే ఈ స్కీం కింద లబ్ధి చేకూరింది. ఇక మీదట గిరిజన బంధు అమల్లోకి వస్తే.. మిగతా స్కీమ్ లన్ని ఆటోమేటిగ్గా రద్దయ్యే అవకాశముంది.

హక్కు పత్రాలు జారీ చేస్తేనే గిరిజన బంధుపై ముందుకు..

గిరిజన బంధు స్కీమ్ ను ప్రకటించిన సమయంలోనే భూమి లేని గిరిజనులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని సీఎం చెప్పిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటనను బట్టి ముందుగా పోడు భూములకు పట్టాలివ్వనిదే అర్హుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. పోడు భూముల హక్కు పత్రాల జారీలో జరుగుతున్న ఆలస్యమే ఇప్పుడు ఈ స్కీమ్ అమలుకు అడ్డంకిగా మారింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో పోడు భూముల సర్వేనే ఇంకా పూర్తి కాలేదు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ మధ్య గెట్టు పంచాయితీలు తేలడం లేదు. డిసెంబర్ 1 తర్వాత పోడు రైతులకు హక్కు పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అందుకు అవసరమైన ప్రక్రియ ఎక్కడా మొదలుకాలేదు. హక్కు పత్రాలకు అర్హులను గుర్తిస్తే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.