మూడురోజులుగా విడవని వాన

మూడురోజులుగా విడవని వాన

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి,  వెలుగు : ఉమ్మడి మెదక్​ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. చాలా చోట్ల ఓ మోస్తారు వర్షం పడగా, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.  మెదక్​ జిల్లా వ్యాప్తంగా సరాసరి 4.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్​ (ఘనపూర్​ ఆనకట్ట) పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ఇరిగేషన్​ ఆఫీసర్​లు ఆనకట్ట నుంచి మహబూబ్​నహర్, ఫతేనహర్​ కాల్వలకు నీటిని విడుదల చేశారు. పొలాల్లో పుష్కలంగా నీరు చేరింది. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక కొల్చారం మండలం పోతంశెట్​పల్లి చౌరస్తాలోని ప్రైమరీ స్కూల్​ ఆవరణ జలమయమైంది. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఇండ్ల మధ్యన పెద్ద మొత్తంలో నీరు నిలిచింది. పిల్లికొటాల్​లోని డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీలో రోడ్లు జలమయమమై రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. 

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 27.1 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట పట్టణ సమీపంలోని లింగారెడ్డిపల్లి చెరువు మత్తడి దూకగా పలు చోట్ల పొలాల్లో భారీగా నీరు చేరింది. పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు, పాత బస్టాండు, హైదరాబాద్ రోడ్డుల్లో  సమీపంలో  పెద్ద ఎత్తున నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయినా రోడ్ల పై వరద నీరు నిలవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్​ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో  సిద్దిపేట హనుమకొండకు రాకపోకలు నిల్చిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో 31.7 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 2,875 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 445 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 18.745 టీఎంసీల నీటినిల్వ ఉంది.