హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో 3 రోజులు పరిస్థితి ఇంతే..!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో 3 రోజులు పరిస్థితి ఇంతే..!

గ్రేటర్ హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వర్షం పడుతోంది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన వర్షం నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం (నవంబర్ 23న) ఉదయం వాతావరణం ఒక్కసారిగి మారిపోయింది. పలు చోట్ల వర్షం కురిసింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లో వర్షం పడుతోంది. 

ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మోహిదీపట్నం, కూకట్ పల్లి, పటాన్ చెరులో వర్షం పడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మూడు రోజులు వాతావరణం చల్లగా ఉండడంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. 

మరోవైపు.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో తమిళనాడు, కేరళలో లోతట్టు ప్రాంతాల్లో వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.