కౌలు రైతులను గుర్తించడం కష్టమే : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

కౌలు రైతులను గుర్తించడం కష్టమే : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి
  •  రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతతో లిక్కర్ ఇన్​కం 25 శాతం తగ్గుతది..
  • అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే
  • డ్రగ్స్​ విషయంలో యాక్టర్స్​తో పాటు ఎవరున్నా వదలొద్దు

కరీంనగర్, వెలుగు : బెల్ట్ షాపుల మూసివేతతో లిక్కర్ ద్వారా సర్కార్​కు వచ్చే ఆదాయం కనీసం 25 శాతం వరకు తగ్గుతుందని, అయినా  వెంటనే కార్యాచరణ ప్రకటించి షాపులు మూసివేయాలని  కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. మద్యం పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని, కానీ.. మద్యం వినియోగాన్ని బెల్ట్ షాపుల మూసివేత ద్వారా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. కరీంనగర్​లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో గురువారం ఆయన సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. బీఆర్​ఎస్​ సర్కారు పదేండ్లలో లిక్కర్ ఆదాయాన్ని రూ.8 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచిందన్నారు. గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ ను అరికట్టి అందులో సినీనటులతో పాటు ఎవరున్నా చర్యలు తీసుకోవాలన్నారు.  వంట గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే అమలు చేస్తామన్నారు. అలాగే విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ రైతు భరోసా కోసం కౌలు రైతులను గుర్తించడం కష్టమేనన్నారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం సాధ్యమేనన్నారు. హుస్నాబాద్​ను సిద్ధిపేటలో కలపడం మూర్ఖపు చర్య అని, హుస్నాబాద్​ను తిరిగి కరీంనగర్ లో కలపాలన్న డిమాండ్ సాధ్యం అవుతుందన్నారు.  

ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు.

జగిత్యాల రూరల్ : కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఫైర్​అయ్యారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొలాసలోని ఫిల్టర్ బెడ్ ను పరిశీలించి దాని పునరుద్ధరణకు కావాల్సిన నిధులను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. జీవన్​రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం కాంగ్రెస్ నాయకులకు ఉందని, కేటీఆర్ బాధపడాల్సిన అవసరం లేదన్నారు.