
సర్కార్ బిల్డింగ్లు, జాగలను కట్టబెట్టే ప్లాన్
ఏండ్లకు ఏండ్లు లీజులకిచ్చేలా ప్రతిపాదనలు
ఖాళీ బిల్డింగ్లు, జాగల వివరాలు తెప్పించుకున్న సర్కార్
కొన్ని ఆస్తులు లీజుకు.. మరికొన్ని అమ్మేయడంపై ఫోకస్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ లు, జాగలను అయినోళ్లకు అగ్గువకు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధమైన్నట్టు తెలిసింది. వీటిని ఏండ్లకు ఏండ్లు లీజులకు ఇచ్చేలా ప్రతిపాదనలు రెడీ చేసినట్టు సమాచారం.
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ లు, జాగలను అయినోళ్లకు.. అగ్గువకు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీటిని ఏండ్లకు ఏండ్లు లీజులకు ఇచ్చేలా ప్రతిపాదనలు రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇమ్మూవబుల్ అసెట్స్ వివరాలను ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. ఎంత విస్తీర్ణంలో బిల్డింగ్లు ఉన్నాయి? ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి? అని వివరాలు తెప్పించుకుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఎక్కడ ఎంత అవసరం? అదనంగా ఎంత ఉంది? అనే వివరాలను తీసుకుంటోంది. దీని ఆధారంగా ఖాళీగా ఉన్న కొన్ని ప్రభుత్వ బిల్డింగ్‌లను లీజుకివ్వడం, మరికొన్నింటిని కూల్చేసి ఆ స్థలాలను అమ్మేయడంపై సర్కారు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
కోటి గజాల్లోని బిల్డింగ్లు పడావు
రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల గజాల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. దీంట్లో కోటి గజాల్లోని బిల్డింగులు పడావుగా ఉన్నట్టు సమాచారం. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌తోపాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ వంటి కీలక ప్రాంతాల్లోని బిల్డింగ్స్ ఇందులో ఉన్నాయి. కొత్త సెక్రటేరియెట్ అందుబాటులోకి వస్తే.. బయట అడ్జస్ట్ అవుతున్న కార్యాలయాన్ని ఖాళీ కానున్నాయి. వీటన్నింటిలో పాత బిల్డింగ్స్‌ను కూల్చేసి ఆ స్థలాన్ని లీజుకియ్యడం లేదా కొన్ని అమ్మేయడం గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అధికార పార్టీలో అయినవాళ్లకు తక్కువ ధరకు వీటి లీజును కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు సేకరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్ సిటీ, జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగ్లు, ఆ పరిసర ప్రాంతాలను ఏండ్లకు ఏండ్ల పాటు తక్కువ మొత్తంతోనే లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనలను ఆఫీసర్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎవరికి ఎక్కడ లీజుకు ఇవ్వాలనే దానిపై మంత్రుల్లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏ ప్రభుత్వ ఆఫీసు ఖాళీగా ఉన్నదనే వివరాలను కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలే తెలుసుకుని, అక్కడ ఎంత జాగ ఉందో ఆరా తీసి డిపార్ట్మెంట్ల నుంచే 20 ఏండ్ల నుంచి 50 ఏండ్లు లీజుకు ఇచ్చేలా ప్రతిపాదలను సిద్ధం చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఎన్నికలు రాకముందే ఈ తంతును ముగించేలా అధికార పార్టీ లీడర్లు పావులు కదుపుతున్నారు.
650 ఎకరాలు అమ్మేందుకు ప్లాన్
ఎక్కువ విస్తీర్ణంలో బిల్డింగ్లు ఉండటంతోపాటు ఖాళీ జాగాలను అమ్మేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం దాదాపు 650 ఎకరాలను గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉన్న ఈ భూములతో వేల కోట్లు ఆర్జించాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారు. వాటిల్లోనే ఈ స్థలాలనూ కలిపి అమ్మేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు బడ్జెట్లో నాన్ రెవెన్యూ టాక్స్‌లో ఈ భూములు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా టార్గెట్‌గా చూపనున్నట్లు తెలుస్తోంది.