కాంగ్రెస్​ను గట్టెక్కించడం సోనియాకు సవాలే!

కాంగ్రెస్​ను గట్టెక్కించడం సోనియాకు సవాలే!

గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ కాంగ్రెస్​ ఉత్తరప్రదేశ్ ​సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. హిస్టరీలోనే తొలిసారి తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఇప్పుడా పార్టీ ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​కు ఆదరణ కూడా అత్యంత వేగంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో దాన్ని గట్టెక్కించడం ఆ పార్టీ ప్రెసిడెంట్​ సోనియా గాంధీకు అతిపెద్ద సవాల్​గా మారింది. 2024లో లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని గాడిన పెట్టడానికి సోనియాకు సరిపడా సమయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​కు పూర్వవైభవం తీసుకురావడమే ఆమె ముందున్న అసలైన టాస్క్​. 

కాంగ్రెస్ ​సంక్షోభంలో ఉండగా1998లో పగ్గాలు చేపట్టిన సోనియాగాంధీ 2004లో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్​ పార్టీ కేంద్రంలో పదేండ్ల పాటు పవర్​లో ఉంది. అలాగే దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అప్పటి లాగానే ఇప్పుడు కూడా పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపి.. మునిగిపోతున్న నావను కాపాడాల్సిన బాధ్యత సోనియాపై పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన మూడు రోజులకే కాంగ్రెస్​ వర్కింగ్​కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ ​పెట్టారు సోనియాగాంధీ. పార్టీ నాయకులు కోరితే తాను పక్కకు తప్పుకునేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఆమె ప్రకటించారు. తిరుగుబాటు నేతలతో కూడిన జీ-23 లీడర్లలో ముగ్గురు సీడబ్ల్యూసీ మెంబర్లుగా ఉన్నారు. అయినా కూడా సీడబ్ల్యూసీ మీటింగ్​ఏకగ్రీవంగా సోనియా రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించింది. ఆగస్టులో జరిగే పార్టీ ప్రెసిడెంట్​ఎలక్షన్ల వరకు ఆమే పార్టీ ప్రెసిడెంట్​గా కొనసాగాలని కోరింది. దీంతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన సోనియా మొదటగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆదేశించారు. 2024 జనరల్​ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని పార్టీని ముందుకు నడిపించడానికి బ్లూప్రింట్​ను సిద్ధం చేసే దిశగా ‘చింతన్​ శిబిర్’​ నిర్వహించాలని ఆమె నిర్ణయించారు.

ఎందుకీ దురవస్థ?
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్​ పార్టీకి ప్రస్తుతం ఎందుకీ దురవస్థ ఏర్పడిందనేందుకు కారణాలు స్పష్టంగానే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్​పార్టీకి అన్ని వర్గాల మద్దతు ఉండేది. 1991లో కోల్డ్​వార్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్​ తదితర పరిణామాల వల్ల దేశ రాజకీయ పరిణామాల్లో మార్పు మొదలైంది. దీనికి కారణం మధ్యతరగతి జనాలే. ప్రస్తుతం మన దేశంలో మిడిల్​క్లాస్​ జనాల సంఖ్య 60 కోట్లకు పైనే. స్వాతంత్య్ర పోరాట కాలం మాదిరిగా కాకుండా, లౌకికవాదం, సోషలిజం, ప్రజాస్వామ్యం వంటి వాటి పట్ల ఇప్పుడు మధ్యతరగతి జనాలు ఎక్కువ ఉత్సాహం చూపడం లేదు. ఇదే ఇప్పుడు రాజకీయంగా మార్పులకు ప్రధాన కారణం. మరోవైపు 1998 నుంచి బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వచ్చింది. మధ్యతరగతి జనాలు కాంగ్రెస్ ​దూరం కావడం కూడా ఇక్కడే మొదలైంది. వారంతా ఎక్కువగా బీజేపీవైపు మొగ్గు చూపుతూ వచ్చారు. మళ్లీ మధ్యతరగతి జనాలకు చేరువ కాగలిగితేనే కాంగ్రెస్​ పార్టీ మనుగడ సాధించగలుగుతుంది. 

అన్ని వైపుల నుంచీ ఒత్తిడి
ఒకవైపు పార్టీ పరాజయం, మరోవైపు ప్రతిపక్షాలన్నీ దూరం పెట్టడంతో కాంగ్రెస్​ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్​సీఎం మమతా బెనర్జీ, ఆమ్​ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్​కేజ్రీవాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్​పవార్.. తదితరులు కాంగ్రెస్​ పార్టీని దూరం పెడుతున్నారు. ప్రతిపక్షాల లీడర్​షిప్​ను తీసుకోవాలని మమత ఇటీవల చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పెట్టిన మీటింగ్​లకు వెళ్లని ఆమె.. సొంతంగానే చాలా మంది లీడర్లను కలిశారు. మరోవైపు పంజాబ్​అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​గెలుపు కేజ్రీవాల్​కు నేషనల్​పాలిటిక్స్​లోకి వచ్చే అవకాశం కల్పించింది. దీంతో మిగతా రాష్ట్రాలపై కూడా ఇప్పుడు ఆప్​ఫోకస్​ పెడుతోంది. మమత, కేజ్రీవాల్, శరద్​పవార్​ తదితరులతో పాటు మిగతా పక్షాల మద్దతు కూడగట్టి ప్రతిపక్షాల లీడర్​షిప్​ను కొనసాగించడం ఇప్పుడు కాంగ్రెస్​అవసరం. కానీ అది అంత సులువైనదేమీ కాదు.

చింతన్​ శిబిర్​ నిర్వహణ?
1998 మార్చి 14న కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​గా సోనియా బాధ్యతలు చేపట్టారు. మార్చి15న కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ చైర్​పర్సన్​గా ఆమె ఎన్నికయ్యారు. తర్వాత ఆమె కాంగ్రెస్​ను గాడిన పెట్టే చర్యలు మొదలుపెట్టారు. పార్టీకి దిశానిర్దేశం చేయడానికి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి 1998 సెప్టెంబర్​లో మధ్యప్రదేశ్​లోని పంచమర్హిలో సోనియా చింతన్​ శిబిర్​ నిర్వహించారు.1974లో పార్టీ సిద్ధాంతపరమైన గందరగోళంలో ఉండగా ఇందిరాగాంధీ ఇలాంటి కార్యక్రమాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా పార్టీకి దిశానిర్దేశం చేయడానికి, కార్యకర్తలను నిరుత్సాహం నుంచి బయటపడేసేందుకు మళ్లీ చింతన్ ​శిబిర్​ నిర్వహించాలని సోనియా భావిస్తున్నారు.

- పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్