అదానీ గ్రూపులో ఎల్ఐసీ పెట్టుబడులపై వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన కథనం దేశ ఆర్థికవ్యవస్థలోని ప్రమాదకర బంధాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వివాదం 2025 మేలో మొదలైనప్పటికీ, తాజా కథనంలో పేర్కొన్న అంశాలు మోదీ పాలనలో అదానీకి లభిస్తున్న ఆర్థిక ప్రాధాన్యతను తెల్పుతోంది. ఎల్ఐసీ సుమారు 3.9 బిలియన్ డాలర్లు (దాదాపు 33 వేల కోట్లు) అదానీ గ్రూపు కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం, అదానీ పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ బాండ్లలో 3.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేయగా, మిగిలినవి షేర్ల రూపంలో ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు దీనిని ‘పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరించే చర్య’గా పేర్కొన్నా నిపుణుల దృష్టిలో ఇది ప్రజల పొదుపులను అధిక ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం. అదానీ ట్రాక్ రికార్డు అంతగా బలంగా లేదు. ఎల్ఐసీ తమ పెట్టుబడులు స్వతంత్ర నిర్ణయాల ఫలితమని ఆ సంస్థ చెబుతోంది. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలతో ఈ చర్య జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇది 30 కోట్ల పాలసీ హోల్డర్ల ఆర్థిక భద్రతను ముప్పులోకి నెట్టే ప్రమాదకర చర్య అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత కోల్పోయిందనడానికి నిదర్శనం అంటున్నారు.
రాజకీయ అనుకూలత ప్రభావం
2014లో మోదీ ప్రధానిగా పదవిలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూపు వృద్ధి వేగం ఆర్థిక చరిత్రలో అరుదైనది. 2014కు ముందు అదానీ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 8 బిలియన్ డాలర్లు (దాదాపు 50 వేల కోట్లు) కాగా, 2025 నాటికి అది 260 బిలియన్ డాలర్లకు (దాదాపు 21 లక్షల కోట్లు) చేరింది. అంటే పదకొండేళ్లలో 32 రెట్లు పెరుగుదల. 2018లో ఆరు విమానాశ్రయాలను ఒకే గ్రూపుకు అప్పగించడం, విదేశీ ప్రాజెక్టులకు దౌత్య సహకారం ఇవ్వడం కార్పొరేట్ అనుచర వాదిత్వానికి స్పష్టమైన ఉదాహరణలు. 2023లో హిండేన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటికీ, నియంత్రణ సంస్థలు స్పందనలో ఆలస్యం చేశాయి.
ఆ నివేదికతో అదానీ షేర్ల విలువ క్షీణించినప్పుడు, ఎల్ఐసీ ముందుకువచ్చి పెట్టుబడులు పెట్టడం ఆర్థిక రక్షణ కవచంలా మారింది. ఇదే విధంగా 2025లో కూడా ప్రభుత్వం పరోక్షంగా ఆర్థిక మద్దతు అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ చెప్తోంది. ఈ క్రమం ఒక వ్యాపార సామ్రాజ్యం ఎదుగుదల వెనుక రాజకీయ అనుకూలత ఎంత ప్రభావవంతంగా ఉందో వెల్లడిస్తోంది. ఎల్ఐసీ వంటి ప్రజా సంస్థలు ప్రజల విశ్వాసంతో నడుస్తాయి, కానీ వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆర్థిక నైతికతను దెబ్బతీస్తుంది. సెబీ విచారణల ఆలస్యం, ఇర్డా నిబంధనల ఉల్లంఘనలు, పారదర్శకత లోపం. ప్రభుత్వ ఆధీన సంస్థలు ఒక వ్యక్తి సామ్రాజ్యానికి మద్దతు ఇచ్చే సాధనాలుగా మారితే, అది ప్రజాస్వామ్య విలువల పతనానికి సంకేతం. భారత్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే పారదర్శకత, స్వతంత్ర నియంత్రణ వ్యవస్థలు అవసరం.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం
