తెలంగాణలో వేగంగా ఏఐ విద్య, పరిశోధనలు!

తెలంగాణలో వేగంగా  ఏఐ విద్య, పరిశోధనలు!

ఈ మధ్య కాలంలో దేశాలు,  ప్రభుత్వాలు,  కంపెనీలు ఒక వజ్రాయుధంగా భావిస్తున్న, చర్చిస్తున్న అంశం కృత్రిమ మేధస్సు (ఏఐ).  కృత్రిమ మేధస్సు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి? అని ప్రతి సామాన్యుడు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నాడు.  మనిషిలాగ ఆలోచించి, నేర్చుకుని నిర్ణయాలు తీసుకునేవిధంగా కంప్యూటర్లు, యంత్రాలు పని చేయగలిగేలా రూపొందించే సాంకేతికతనే ఏఐ అంటారు. మన మాటలు గుర్తుపట్టే ఫోన్స్, ఆటోమేటిక్ కార్లు, మనతో మాట్లాడే చాట్‌‌‌‌బాట్స్ ఇవన్నీ ఏఐ ఆధారిత వ్యవస్థలే.  కృత్రిమ మేధస్సు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఏఐతో ఉత్పాదక శక్తి పెరుగుతుంది. 

పునరావృత  పనులను యంత్రాలు చేస్తే మనుషులకు  సృజనాత్మక  పనులకు ఎక్కువ సమయం దొరుకుతుంది.  పాలనవ్యవస్థ వేగవంతం అవుతుంది.  ప్రభుత్వాలు ఫిర్యాదులు పరిష్కరించడం, దరఖాస్తుల పరిశీలన,  ప్రజలకు సమాచారాన్ని అందించడం వంటి సేవల్లో ఏఐని వినియోగిస్తూ  పారదర్శకత పెంచుతున్నాయి. ఆరోగ్య రంగంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది.  వ్యాధులను ముందే గుర్తించడం, వైద్యులకు సలహాలు ఇవ్వడం, శస్త్రచికిత్సలకు సహకరించడం వంటి పనులు ఏఐ ద్వారా సాధ్యమవుతున్నాయి.  పర్యావరణ  పరిరక్షణలో కూడా దోహదకారిగా ఉంది. వర్షాల అంచనాలు, కాలుష్యం గమనింపు, విద్యుత్ వినియోగ నియంత్రణ ఇలా ఎన్నోవిధాల సహాయం అందిస్తోంది.

'ఏఐ పవర్డ్ తెలంగాణ'

దేశంలో  ఏఐ  వినియోగంలో  తెలంగాణ ముందంజలో ఉంది.  రాష్ట్ర ప్రభుత్వం ‘ఏఐ పవర్డ్ తెలంగాణ’ అనే అధికారిక  విధాన పత్రాన్ని విడుదల చేసి టీజీడీఈఎక్స్ అనే డేటా ఎక్స్చేంజ్ వేదికను ఏర్పాటు చేసింది. హైదరాబాదులో  ఇప్పటికే  మైక్రోసాఫ్ట్,  గూగుల్,  అమెజాన్,  మెటా వంటి దిగ్గజ సంస్థలు ఏఐ పరిశోధనలు చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఇన్నోవేషన్ హబ్ స్థాపనకు సన్నద్ధమవుతూ ప్రతి శాఖకు ఏఐ నోడల్ అధికారులను నియమించింది.  సంక్షేమ హాస్టళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు పద్ధతి,  ప్రభుత్వ డాష్‌‌‌‌బోర్డుల్లో ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే అమలవుతున్నాయి. అంతేకాక గ్లోబల్ కంపెనీలతో కలిసి  ప్రజాసేవలలో జనరేటివ్ ఏఐ వినియోగాన్ని పరీక్షిస్తోంది. 

ఉపాధిని పెంచుతుందా? తగ్గిస్తుందా?

 ఏఐ వల్ల కొంతమంది ఉపాధిని కోల్పోతారని భావిస్తున్నారు. కానీ, నిజం ఏమిటంటే కొన్ని పునరావృత, టైపింగ్, డేటా ఎంట్రీ,  అకౌంటింగ్ వంటి పనులు ఆటోమెటిక్ అవుతాయి. అయితే, అదే సమయంలో  డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్, మోడల్ ట్రైనర్, ఏఐ కంటెంట్ డిజైనర్ వంటి కొత్త ఉద్యోగాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయి.  గతంలో కంప్యూటర్ యుగం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది, కానీ, ఇప్పుడది మరింత ఎక్కువ ఉద్యోగాలను సృష్టించింది. కాబట్టి ఉపాధి తగ్గకుండా రూపం మారుతుంది. దీనికి మనం సిద్ధంగా ఉండాలి,  కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి.

 కీలక రంగాల్లో కృత్రిమ మేధస్సు 

ప్రపంచవ్యాప్తంగా ఏఐ  వృద్ధితో లక్షల కోట్ల రూపాయల విలువ సృష్టి  జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆరోగ్యం, ఫైనాన్స్, వ్యవసాయం, తయారీ రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్​లు పెద్ద ఎత్తున పెరుగుతాయి. ఐటీకి  కేంద్రంగా ఉన్న తెలంగాణ ఈ రంగంలో తనవంతు వాటాను సంపాదించేందుకు సరైన స్థితిలో ఉంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, శిక్షణ పాలన వ్యవస్థ, ఫైనాన్స్, రవాణా, విద్యుత్ రంగం మొదలగు వాటిలో కృత్రిమ మేధస్సు పాత్ర అసామాన్యం.  

దేశ భవిష్యత్ ఆవిష్కరణకు  అద్భుతమైన దారులు తెరుచుకున్నాయి. ఏఐ ఒక సాధనం మాత్రమే కాదు, అది భవిష్యత్తును మలుపుతిప్పగల శక్తి. దాన్ని ఎలా వినియోగిస్తామో దానిపై మన సమాజం ఎలా మారుతుందో ఆధారపడి ఉంటుంది.  తెలంగాణ  ఇప్పటికే  సాంకేతికంగా ముందంజలో ఉంది.  ఇప్పుడు చేయాల్సింది, ప్రతి ఒక్కరికీ  కృత్రిమ మేధస్సు  ప్రయోజనం అందేలా సమతౌల్యంగా ముందుకెళ్లడం. సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ,   పాత భయాలను దాటుకుంటూ సమగ్ర అభివృద్ధి దిశగా దూసుకెళితే ఏఐ నిజంగా 
తెలంగాణకు బలమైన మిత్రుడవుతుంది.

తెలంగాణలో ఏఐ విద్యాబోధన

ఏఐ రంగంలో ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'టాస్క్' ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్,  జేఎన్టీయూ,  ఓయూ,  ఎన్ఐటి వరంగల్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఏఐ/ మెషీన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి.  ఒక్క రాష్ట్రంలోనే  లక్షమందికి పైగా యువతకు ఏఐ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే, సంవత్సరానికి ఎంతమంది ఏఐ గ్రాడ్యుయేట్స్ ఉత్పత్తి అవుతున్నారనే స్పష్టమైన గణాంకం ప్రభుత్వపరంగా  ప్రచురించలేదు. 

ఏఐ పేదల జీవితాల్లో గొప్పమార్పు తీసుకురాగలదు.  రైతులకు వర్షాల అంచనాలు,  పురుగు హెచ్చరికలు,  మార్కెట్ రేట్లు ముందుగా చెప్పే సేవలు అందించవచ్చు.  గ్రామాల్లో విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ టీచర్ ను అందించవచ్చు. సంక్షేమ పథకాల్లో కేటాయింపులు కచ్చితంగా న్యాయంగా జరిగేలా చేయవచ్చు. అయితే డిజిటల్ యాక్సెస్ లేకుండా ఉంటే వారు వెనుకబడి పోయే ప్రమాదం కూడా ఉంది.  కాబట్టి  ప్రభుత్వాలు డిజిటల్ సౌకర్యాలను  ప్రతి గ్రామానికి, సామాన్య ప్రజానీకం అందరికీ సమంగా అందించాల్సిందే. 

- దురిశెట్టి మనోహర్, రిటైర్డ్ ఏడీఈ