కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరివల్లా కాదు

కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరివల్లా కాదు
  • సహజ వనరుల దోపిడీ కోసమే ఆపరేషన్‌ కగార్‌: కూనంనేని

మహబూబాబాద్/కురవి, వెలుగు: కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరివల్లా కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సమాజంలో దోపిడీ, అణచివేత, అసమానతలు, వివక్ష ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో శనివారం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. అంబానీ, ఆదానీ కోసమే కేంద్ర ప్రభుత్వం, అమిత్‌షా పనిచేస్తున్నారని విమర్శించారు. 

అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాలను దోచిపెట్టేందుకే కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ నిర్వహిస్తోందని ఆరోపించారు. శాంతి చర్చలకు సిద్ధమని మవోయిస్టులు ప్రకటించినా కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. మావోయిస్టులు, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌)తో పాటు ఎర్ర జెండా పట్టుకున్న ప్రతివాడు తమవాడేనన్నారు. కమ్యూనిజాన్ని అంతం చేయడం హిట్లర్‌ వల్లే కాలేదని, అమిత్‌ షా వల్ల ఏం అవుతుందని ఎద్దేవా చేశారు. 

1951 వరకు తాము సాయుధ పోరాటం చేశామని.. పరిస్థితులను బట్టి తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టామన్నారు. మళ్లీ వాటిని తీసే అవసరం రాకూడదనే కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మానుకోటను ఎర్రకోటగా మార్చాలని కూనంనేని కోరారు. డిసెంబర్-26న 100 సంవత్సరాల వేడుకలను ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలిపారు.