మంచి భవిష్యత్ ను నిర్మించుకోవటానికి ఇదో అవకాశం

మంచి భవిష్యత్ ను నిర్మించుకోవటానికి ఇదో అవకాశం
  • కరోనా పై ప్రపంచ దేశాల పోరాటాన్ని అభినందించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్

జెనీవా : కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం వరల్డ్ వైడ్ గా చాలా దేశాలు ఆర్థిక సహాయం అందించటం మంచి పరిణామమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. దాదాపు 8.1 బిలియన్ డాలర్లను ప్రపంచంలోని చాలా దేశాలు విరాళాలుగా ఇచ్చాయని చెప్పారు. ఇది కనిపించని శత్రవు పై పోరాడేందుకు మన ఐక్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో టెడ్రోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే యూనిటీతో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ను ఏర్పాటు చేసుకోవటానికి ఇది అవకాశం అని ఆయన చెప్పారు. చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనాతో పోరాటానికి మరింత ఆర్థిక సహాయం అవసరమని అన్ని దేశాలు నిధులు విషయంలో తమ వంతు సహాయం అందించాలని కోరారు. కరోనా కు ఎంత త్వరగా మందు కనుగొంటామన్న దానికన్నా కూడా అన్ని దేశాలకు దాని ప్రయోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా పై పోరాటం మాదిరిగానే భవిష్యత్ లో ప్రతి ఒక్కరూ అత్యున్నత ఆరోగ్య హక్కు పొందేందుకు కృషి చేయాలని సూచించారు.