మంచి పథకాలు రాజకీయాల్లో చిక్కుకోవడం మన దౌర్భాగ్యం

మంచి పథకాలు రాజకీయాల్లో చిక్కుకోవడం మన దౌర్భాగ్యం
  • ఢిల్లీలో ట్రాన్సిట్​ కారిడార్​ను ప్రారంభించిన ప్రధాని
  • కొత్త పథకాలను తీసుకొచ్చినం: మోడీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్లే దేశ రాజధాని ఢిల్లీ రూపులేఖలు మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కేంద్రం సదుద్దేశంతో తీసుకొచ్చిన ఎన్నో పథకాలు రాజకీయాల్లో చిక్కుకుపోవడం మన దేశ దౌర్భాగ్యమని చెప్పారు. మీడియా కూడా టీఆర్పీల కోసం ఈ అంశాలను ఎక్కువ చేసి చూపిస్తున్నాయని మండిపడ్డారు. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు, ట్రాన్సిట్​ కారిడార్​లకు వ్యతిరేకంగా కొంత మంది యాక్టివిస్ట్​లు, ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించాయి. అలాగే అగ్నిపథ్​ స్కీమ్​పైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే మోడీ ఏ స్కీమ్​ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఈ కామెంట్లు చేశారు.

ఢిల్లీకి కేంద్రం బహుమతి

ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్​ వద్ద ఇంటిగ్రేటెడ్​ ట్రాన్సిట్​ కారిడార్​లో భాగంగా మెయిన్​ టన్నెల్, ఐదు అండర్​పాస్​లను మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని మొట్టమొదటిదైన 1.6 కి.మి. ఈ టన్నెల్ ద్వారా ఈస్ట్​ ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ నుంచి ఇండియా గేట్, సెంట్రల్​ ఢిల్లీలోని ప్రాంతాలకు ట్రాఫిక్​ అడ్డంకులు లేకుండా సులువుగా చేరుకోవచ్చు. ట్రాన్సిట్​ కారిడార్​ ప్రాజెక్టు కోసం రూ.920 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు సంబంధించి కేంద్రం అద్భుతమైన బహుమతిని అందించిందని మోడీ అన్నారు. ఎన్సీఆర్​ రీజియన్​లోని సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో దేశ రాజధాని గురించే అంతా చర్చించుకుంటారని, ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని చెప్పారు.

నేడు కర్నాటకకు ప్రధాని మోడీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సోమవారం కర్నాటక చేరుకుంటారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే మంగళవారం మైసూర్​లో జరిగే అంతర్జాతీయ యోగా డేలో కూడా ఆయన పాల్గొంటారు. అజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా దేశంలోని 75 ఐకానిక్​ లొకేషన్లలో 75 మంది కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో యోగాడే వేడుకలు నిర్వహిస్తారు.