కేంద్ర మంత్రి అయ్యుండి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడమేంటి

కేంద్ర మంత్రి అయ్యుండి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడమేంటి

తెలంగాణ లో ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్‌. కేంద్ర హోం శాఖ మంత్రిగా రాజ్యాంబద్ధమైన పదవిలో ఉంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సీఎం, ఆయన పోలీసులపై నేరుగా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని  కామెంట్లు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ రైట్ టు ప్రైవసీ ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోగల్గిన అన్ని అధికారాలు సాధికారత ఉన్న రాజ్యాంగబద్దమైన పదవి లో ఉండి కూడా… కిషన్ రెడ్డి సామాన్యుడిలా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటే, మరి సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేతల ఫోన్లను ట్యాప్‌ చేయడం ఎప్పటి నుంచో జరుగుతోందన్నారు దాసోజు శ్రవణ్. ఇపుడు కిషన్‌ రెడ్డికి తెలిసిన తర్వాత కూడా కేంద్ర హోమ్ మంత్రిగా చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయడమేమిటని అన్నారు. హోం శాఖనే స్వయంగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదని డిమాండ్ చేశారు.

వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతను రాష్ట్ర పోలీసులు, ఐఏఎస్‌ అధికారి జయేష్‌ రంజన్‌లు ఉల్లంఘిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర హోం శాఖకు తాను గతంలో నేరుగా ఫిర్యాదు చేసినా… ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలదేన్నారు. ఇపుడు కిషన్‌ రెడ్డికి కూడా నిజం తెలిసింది కాబట్టి.. వెంటనే విచారణ జరిపి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్‌.