ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ప్రజలే బుద్ధి చెప్తరు : అడ్లూరి లక్ష్మణ్

ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ప్రజలే బుద్ధి చెప్తరు : అడ్లూరి లక్ష్మణ్

 

  •     కేసీఆర్, కేటీఆర్​కు మెదడు పని చేస్తలేదు
  •     రుణమాఫీ అమలును జీర్ణించుకోలేకపోతున్నరు
     

హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడే బీఆర్ఎస్ నేతలకు అదే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. తాము గేట్లను పూర్తిగా తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్క కార్యకర్త కూడా మిగలడని అన్నారు. అధికారం కోల్పోయిన ఆరునెలల్లోనే ఆ పార్టీ కనుమరుగైందన్నారు. 

గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాచరిక పోకడలు, గడీల పాలనతో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయిందని.. అయినా కేసీఆర్, కేటీఆర్​కు ఇంకా బుద్ధి రావట్లేదని మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండీ సెక్రటేరియెట్ కు పోలేదని, కనీసం మంత్రులకు కూడా కలిసే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. 

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తున్నామని, దీన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 

కేటీఆర్ కు మెదడు సరిగ్గా పని చేయడం లేదని, అందుకే ప్రభుత్వం కూలిపోతుందంటున్నారని ఫైర్ అయ్యారు. కూలిపోవడానికి అదేమైన ఫామ్ హౌసా అని ప్రశ్నించారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. దమ్ముంటే టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు. కేసీఆర్ పదేండ్లలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడని, ఎమ్మెల్యేల కొనుగోలు కల్చర్ ​తీసుకొచ్చిందే  కేసీఆర్ అని అన్నారు.