రాజకీయ పార్టీల పేరుతో విరాళాలపై ఐటీ కొరడా

రాజకీయ పార్టీల పేరుతో విరాళాలపై ఐటీ కొరడా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నెండుకుపైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు నిబంధనలు పాటించకుండా విరాళాలు స్వీకరించి ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను (ఐటీ) మినహాయింపును క్లెయిమ్ చేసిన పార్టీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మే నెలలో చర్యలు తీసుకుంది.

బోగస్ విరాళాలు, పన్నుల్లో మోసాలకు పాల్పడ్డారనే కారణాలతో 87 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా బోగస్ క్లెయిములు చేశారనే సమాచారం.. అనుమానం ఉన్న చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐటీ మినహాయంపు.. ఎన్నికల సమయాల్లో సదుపాయాల కోసమే పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు దుమారం చెలరేగిన నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఎక్కడో దొరికిన ఆధారంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో తొలుత 7 రాష్ట్రాల్లో మొదలైన సోదాలు.. 12 రాష్ట్రాలకు పెరిగింది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.