నాలుగు గంటల పాటు ఫీనిక్స్ ఆఫీసులో సోదాలు

నాలుగు గంటల పాటు ఫీనిక్స్ ఆఫీసులో సోదాలు

ఫీనిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నానక్ రామ్ గూడ, గోల్ఫ్ ఎడ్జ్ , మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లలో ఉన్న ఫీనిక్స్ కార్యాలయాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ముంబై నుంచి వచ్చిన 8 మంది ఐటీ అధికారుల బృందం విస్తృత సోదాలు చేసి, పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన మొత్తం 20 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఫీనిక్స్ సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా సహా వివిధ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లాక్ బుక్స్ నిర్వహణకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారుల నుంచి ఐటీ అధికారులు సేకరించారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న లోన్స్.. ఆయా ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారా ? ఇతర కార్యకలాపాలకు దారిమళ్లించారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.