వీళ్లేం క్రికెటర్లు.. నాలుగు ఓవర్లు వేసి అలసిపోతారా?

వీళ్లేం క్రికెటర్లు.. నాలుగు ఓవర్లు వేసి అలసిపోతారా?

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో ఆల్‌రౌండర్ల లేమి అంశం తెరపైకి వస్తోంది. నిఖార్సయిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడమే కీలక మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బతీసిందని పలువురు సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. రవీంద్ర జడేజా స్థానంలో ఇంగ్లండ్ పరిస్థితులకు పనికొచ్చే శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాల్సిందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై భారత లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. ప్రస్తుత క్రికెట్‌ తరంలో ఊపిరి సలపని షెడ్యూల్, తరచూ గాయాల బారిన పడుతుండటంతో ఓ ఆల్‌రౌండర్‌‌లుగా రాణించడం ప్లేయర్లకు అంత సులువు కాదన్నాడు. ఆటగాళ్లు ఫిట్‌నెస్ మీద మరింత ఫోకస్ చేయాలని సూచించాడు.

‘ఒక ఏడాదిలో క్రికెటర్లు పది నెలలు క్రికెట్ ఆడుతూ ఉంటే గాయాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి క్రికెటింగ్ యుగంలో బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయాలనుకుంటున్నారు, బౌలర్లు బ్యాటింగ్ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. అదే మాతరంలో అయితే మేం అన్నింట్లోనూ జోష్ చూపించేవాళ్లం. ఇప్పటి ప్లేయర్లను చూస్తుంటే బాధేస్తోంది. కొందరు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి అలసిపోతున్నారు. ఓ బౌలర్‌కు మూడు, నాలుగు కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ ఇవ్వడానికి జట్లు ఒప్పుకోవడం లేదని తెలిసి బాధేసింది. మాతరంలో ప్రత్యర్థి జట్టులో చివరి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడానికి 10 ఓవర్లు వేసేందుకైనా మేం రెడీగా ఉండేవాళ్లం. ఆ మైండ్‌సెట్‌తో ఉండే వాళ్లం కాబట్టి కండరాలను బలోపేతం చేయడం కోసం యత్నించేవాళ్లం’ అని కపిల్ పేర్కొన్నాడు.