కేసీఆర్ సభ ఖర్చులు..ఆఫీసర్ల నుంచి వసూలు!

కేసీఆర్ సభ ఖర్చులు..ఆఫీసర్ల నుంచి వసూలు!

హైదరాబాద్, వెలుగు : జనవరి 12న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన సీఎం కేసీఆర్​బహిరంగ సభ ఖర్చుల వసూలు కోసం వివిధ డిపార్ట్​మెంట్లకు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత సుమారు 10వేల మందితో సభ ఏర్పాటు చేశారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ సభ నిర్వహణ బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు చూసుకున్నారు. ఇటీవల ఈ లెక్కలు సరిచూసే క్రమంలో ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్​అయింది.  సభ కోసం రూ.70 లక్షల దాకా ఎమ్మెల్యే ఖర్చు చేశారు. పెద్దమొత్తం కావడంతో పలువురు లీడర్లతో పాటు కొత్తగూడెంలోని ఇరిగేషన్, సబ్​రిజిస్ట్రార్, పంచాయతీరాజ్ తదితర శాఖలకు టార్గెట్లు పెట్టినట్లు తెలిసింది. ఇందులో సబ్​రిజిస్ట్రార్​ను రూ.5 లక్షలు పంపుమని చెప్పగా, ఆయన మొదట ఒప్పుకోలేదు. వనమా కొడుకు రాఘవ సంగతి తెలిసిన ఓ రియల్టర్ నచ్చజెప్పడంతో రూ.3లక్షలు తెచ్చి ఎమ్మెల్యే పీఏకు అప్పగించాడు.

ఇటీవల ఎమ్మెల్యే ఇంట్లో ఈ లెక్కలు చేస్తుండగా విషయం గుర్తించి.. సబ్​రిజిస్ట్రార్ నుంచి కేవలం రూ.3లక్షలు ఎలా తీసుకుంటావని పీఏను ఎమ్మెల్యే వెంకటేశ్వర్​రావు సతీమణి, ఆయన కొడుకు రాఘవ నిలదీశారు. తాము మీటింగ్​కు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశామని, అలాంటిది సబ్​రిజిస్ట్రార్ నుంచి కేవలం రూ.3 లక్షలు ఎలా తీసుకుంటావని పీఏను ప్రశ్నించారు. అంత తక్కువ మొత్తం​తీసుకొని బద్నాం అయ్యేకంటే తీసుకోకున్నా బాగుండేదంటూ లొల్లిపెట్టారు. ఇది కాస్తా ఎవరో రికార్డు చేయడంతో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న వనమా రాఘవ, తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.