OTT లవర్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్‌ బాటలోనే డిస్నీ+ హాట్ స్టార్

OTT లవర్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్‌ బాటలోనే డిస్నీ+ హాట్ స్టార్

డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar) సైతం నెట్‌ఫ్లిక్స్‌ బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రీమియం యూజర్లకు పాస్‌వర్డ్‌ షేరింగ్ (Password Sharing)ను కేవలం నాలుగు డివైజ్ లకు మాత్రమే అనుమతించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. 

గతంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే జనం, ఇటీవల ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ సంస్థలకు బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సంస్థలు ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్‌లు ఇస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్ ఐడీ షేరింగ్ పాస్‌వర్డ్ నిలిపివేసిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ బాటలోనే మరో ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ప్రీమియం యూజర్లకు పాస్‌వర్డ్‌ షేరింగ్ ను కేవలం నాలుగు డివైజ్‌లకు మాత్రమే అనుమతించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ నిబంధనలను ముందుగా భారత్ సహా మరికొన్ని దేశాల్లో అమల్లోకి తేవాలని సంస్థ భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. తాజా నిర్ణయంతో యూజర్ల సంఖ్య పెరుగుతుందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యులకు మాత్రమే పాస్‌వర్డ్‌ షేర్ చేసే వెసులుబాటు కల్పించింది. ఫ్యామిలీ మెంబర్స్‌ కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాలని స్పష్టం చేసింది. వారం క్రితమే ఈ నిబంధనలను భారత్ లో కూడా అమల్లోకి తెచ్చింది. 100 కంటే ఎక్కువ దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది. డిస్నీ+ హాట్‌ స్టార్ సైతం నెట్‌ ఫ్లిక్స్ బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది.