పాలిటిక్స్ లోకి దిల్ రాజు.. ఎంపీగా పోటీ చేసే చాన్స్

పాలిటిక్స్ లోకి దిల్ రాజు.. ఎంపీగా పోటీ చేసే చాన్స్
  • పాలిటిక్స్ లోకి దిల్ రాజు
  • ఎంపీగా పోటీ చేసే చాన్స్
  • బీఆర్ఎస్ నుంచా కాంగ్రెస్ నుంచా
  • రెండు పార్టీలోనూ సత్సంబంధాలు
  • సొంత జిల్లా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగే చాన్స్!
  • ఇప్పటికే ‘మాపల్లె’పేరిట సేవాకార్యక్రమాలు
  • చర్చనీయాంశమైన ‘దిల్’కామెంట్స్

హైదరాబాద్ : సినీ నిర్మాత దిల్ రాజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ తో సత్సంబంధాలు కలిగిన దిల్ రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే తేలిపోనుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి చైర్మన్ గా గెలుపొందారు. 

టీఎఫ్​సీసీ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చాయి. “నేను ఏ పొలిటికల్ పార్టీ తరఫున నిలబడినా ఎంపీగా గెలుస్తా.. నా ప్రియార్టీ మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుంది.”అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. తన సొంత గ్రామం నర్సింగ్ పల్లిలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాటు గ్రామంలో ఇందూరు తిరుమల పేరుతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించి చినజీయర్ స్వామిని తీసుకొచ్చి ప్రతిష్టాపనాది కార్యక్రమాలు చేయించారు. 

ప్రతి నెలా పౌర్ణమి రోజున 16 ఏండ్లలోపు పిల్లలకు స్వర్ణామృత ప్రాశన పేరుతో ఔషధాన్ని ఉచితంగా అందిస్తున్నారు. గర్భిణులకూ ప్రత్యేక ప్రసాదాన్ని కూడా ప్రతి నెలా అందిస్తున్నారు. నిర్ణీత రోజుల్లో ఆలయానికి భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. దాదాపు పదేండ్ల నుంచి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దిల్ రాజు ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అప్పటినుంచే ఉంది. ఎంపీగా పోటీ చేయనున్నట్టు నిన్న ఇటీవల హింట్ ఇవ్వడంతో ఆయన నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారా..? అన్న చర్చ మరోమారు తెరపైకి వచ్చింది.  

నిజామాబాద్ నుంచే పోటీ..? 

గత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మధుయాష్కీ గౌడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా ఉంది. 

మొన్నటి వరకు ఆమె ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారనే చర్చ నడిచింది. ఈ కామెంట్లకు ఆమె చెక్ పెట్టారు. ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డిని మరో సారి ఆశీర్వదించాలంటూ దాదాపుగా టికెట్ ను ప్రకటించారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం బోధన్ నుంచి కవిత బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సొంత సామాజిక వర్గం బలంగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.

ఒక వేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గులాబీ పార్టీ దిల్ రాజును నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. గతంలో రెండు మార్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కీ ఈ సారి నిజామాబాద్ నుంచే బరిలోకి దిగుతారా..? ఆయన పోటీలో నిలవని పక్షంలో దిల్ రాజుకు కాంగ్రెస్ గాలం వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ తో సత్సంబంధాలు కలిగి ఉన్న దిల్ రాజు హస్తం పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందా..? అన్నది డౌటే. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే దిల్ రాజు మరో సెగ్మెంట్ వెతుక్కోవాల్సిందే.!