మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, బంధువుల ఇండ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మంత్రి మల్లారెడ్డి  కార్యాలయాలు, బంధువుల ఇండ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు పూర్తయ్యాయి. దూలపల్లిలోని ప్రవీణ్ రెడ్డి, సుచిత్రలోని త్రిశూల్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు, మల్లారెడ్డి వర్సిటీలోనూ సోదాలు చేశారు. 

అంతకుముందు.. తమ ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీన (సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

ఐటీశాఖ అధికారులపై మల్లారెడ్డి ఆగ్రహం 

అర్ధరాత్రి సమయంలో మంత్రి మల్లారెడ్డి.. గన్ మెన్, సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్ తో హాస్పిటల్ కి వెళ్లారు. తప్పుడు పత్రాలపై ఐటీశాఖ అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఇదే విషయంపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన చిన్న కుమారుడు వెళ్లారు. 

ఎన్ని కోట్లు రాశారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించడంతో రూ.100 కోట్లు అని ఐటీ అధికారి రత్నాకర్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. ఇదే విషయంపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లండి అని అన్నారు. ఐటీ అధికారులు, సిబ్బంది తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న తమ పెద్ద కుమారుడుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. దీనిపై మళ్లీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ మూడుసార్లు ఐటీ అధికారుల సోదాలు జరిగాయి కానీ, ఇంత దౌర్జ్యనం ఎప్పుడూ చూడలేదన్నారు. ‘మా ఇండ్లు, బంధువుల ఇండ్లల్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐటీ అధికారులు చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్లను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. వాళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురి చేస్తున్నారు’ అంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. 

ఐటీశాఖ అధికారులు గందరగోళంగా సోదాలు చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తమ వద్ద ఎటువంటి డబ్బు దొరకలేదన్నారు. తమ మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్దాలు రాశారని చెప్పారు. 

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా 

సోదాల్లో సీజ్ చేసిన ల్యాప్ టాప్ లను ఐటీ అధికారుల నుండి మంత్రి మల్లారెడ్డి అనుచరులు బలవంతంగా లాక్కున్నారు. దీంతో బోయిన్ పల్లి పీఎస్ వద్ద హైడ్రామా నడిచింది. తాను లేని సమయంలో తమ కుమారుడితో బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ సోదాలు

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ‌ అధికారులు సోదాలు చేశారు. మూడు కార్లల్లో వెళ్లిన ఐటీ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం గేటులోకి విద్యార్థులను తప్ప ఇతరులను రానీయలేదని తెలుస్తోంది. ఐటీ అధికారులు, సిబ్బందికి ఆర్మీ జవాన్లు బందోబస్తుగా వెళ్లారని చెబుతున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో మర్రి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. 

టర్కీ నుండి హైదరాబాద్ కు మర్రి రాజశేఖర్ రెడ్డి

మర్రి రాజశేఖర్ రెడ్డి.. టర్కీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజశేఖర్ రెడ్డి.. నేరుగా తమ నివాసానికి వెళ్లారు. ఎయిర్ పోర్టులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు. ఐటీ రైడ్స్ గురించి తనకు తెలియదని, తాను మీడియా ద్వారానే చూసి తెలుసుకున్నానని, ఇంటికి వెళ్లాక పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.