చైనా పంపింది నిఘా బెలూనే!

చైనా పంపింది నిఘా బెలూనే!

చైనా పంపింది నిఘా బెలూనే!

అమెరికా దర్యాప్తులో తేలినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడి   

వాషింగ్టన్ : ఈ ఏడాది మొదట్లో అమెరికా కూల్చేసిన చైనా బెలూన్.. నిఘా కోసం పంపినదే అని తేలింది. అమెరికన్లపై నిఘా పెట్టేందుకే దాన్ని చైనా ప్రయోగించిందని వెల్లడైంది. ఇందుకోసం అమెరికా టెక్నాలజీనే వాడినట్టు కూడా తెలిసింది. ఈ మేరకు అమెరికా సంస్థల దర్యాప్తులో వెల్లడైందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ గగనతలంలోకి వచ్చిన చైనా బెలూన్ ను అమెరికా కూల్చేసింది. అది నిఘా బెలూన్ అని అమెరికా ఆరోపించగా.. అలాంటిదేం లేదు, తాము దాన్ని వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించామని చైనా బుకాయించింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.

బెలూన్ ను కూల్చేసిన అనంతరం.. శకలాలను సేకరించిన అమెరికా దర్యాప్తు చేపట్టింది. అందులో తమ దేశ సర్వీలెన్స్ సిస్టమ్ యూఎస్ గేర్ తో పాటు చైనా సెన్సర్లు, ఇతర సామగ్రి ఉన్నట్టు గుర్తించింది. ‘‘చైనా బెలూన్ కెనడాలోని కొన్ని ప్రాంతాలతో పాటు మా దేశంలోని రాష్ట్రాల గుండా 8 రోజుల పాటు ప్రయాణించింది. ఆ టైమ్ లో ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు ఇతర సమాచారం సేకరించింది. అవి చైనాకు పంపించేందుకు ప్రయత్నించింది. కానీ అది పంపించినట్టు మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మొత్తానికి ఆ బెలూన్ ను నిఘా కోసమే చైనా ప్రయోగించిందని మా దర్యాప్తులో వెల్లడైంది. బెలూన్ లో వాడిన పరికరాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్టు తేలింది” అని ఓ అధికారి చెప్పినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.