
- ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కామెంట్
- ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘మెలోడీ’ స్నేహం
న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ‘నారీ శక్తి’కి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మెలోని ఆత్మకథ ‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్’ ఇండియన్ ఎడిషన్‌ను రూపా పబ్లికేషన్స్ ప్రజల్లోకి తీసుకొస్తున్నది. ఈ పుస్తకానికి ప్రధాని మోదీ ముందుమాట రాశారు. ఈ పుస్తకాన్ని ‘హర్ మన్ కీ బాత్’ గా ఆయన పేర్కొన్నారు.
మెలోని జీవితం అంటే రాజకీయాలు, అధికారం కాదని.. ధైర్యం, నిబద్ధత, ప్రజాసేవ అని చెప్పారు. ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చరిత్రాత్మకమని ప్రశంసించారు. మెలోని ఎదుగుదలను నారీ శక్తితో పోల్చారు. భారత సంప్రదాయాల్లో స్త్రీని శక్తి స్వరూపిణిగా గౌరవిస్తామన్నారు. మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాలు రక్షించాలనే ఆమె ఆలోచనలు భారతీయులకు దగ్గరగా ఉంటాయన్నారు.
రోమ్‌లో సాధారణ కార్మిక వర్గం నుంచి అత్యున్నత పదవి చేపట్టే వరకు మెలోని ప్రయాణం అద్భుతమని తెలిపారు. మెలోనీ తన మూలాలు మరవకుండా దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఆమె ప్రధాని అయినప్పుడు కొంత మంది సందేహించారు.. కానీ ఆమె దేశాన్ని స్ట్రెంథెన్చేస్తూ స్థిరత్వం ఇచ్చారని తెలిపారు.
ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలు స్పష్టంగా ప్రకటించారని చెప్పారు. సాంస్కృతిక వారసత్వం రక్షిస్తూనే ప్రపంచంతో సమానంగా మెలగాలి అని ఆమె నమ్ముతుందన్నారు. ప్రజల పట్ల కరుణ, శాంతి మార్గంలో నడవాలనే ఆలోచనలు మెలోని తన పుస్తకంలో పొందుపరిచారన్నారు. ఈ బుక్ మొదటి సారి 2021లో పబ్లిష్ అయింది. అప్పుడు మెలోని ప్రతిపక్షంలో ఉన్నారు.
2025 జూన్‌లో అమెరికాలో రిలీజ్అయింది. అక్కడ ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. మోదీ, మెలోని స్నేహం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హిట్. కాప్ 28 సదస్సులో తీసుకున్న సెల్ఫీలను ‘#మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మెలోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలతో పాటు మెలోడి పేరు కూడా ట్రెండింగ్అయింది.